ఈ ఏడాది సంక్రాంతి సినీ ప్రియులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. పలు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మంచి విజయాలతో కొత్త ఏడాది ఇండస్ట్రీకి శుభారంభం పలికింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ అంతా వేసవి సీజన్‌పై దృష్టి పెట్టింది. సాధారణంగా సంక్రాంతి తర్వాత సినిమాల హడావిడి ఎక్కువగా ఉండేది సమ్మర్లోనే. ఓ వైపు విద్యార్థులకు హాలిడేస్, మరోవైపు శివరాత్రి, రంజాన్, శ్రీరామనవమి, ఉగాది.. ఇలా వరుస పండుగలతో సందడి నెలకొంటుంది.. ఇవన్నీ సినిమాలకు వేసవి ఇచ్చే వరాలు. ఎప్పటిలాగే ఈ సమ్మర్‌లోనూ భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగనున్నాయి. అవేమిటి? వాటి విశేషాలేంటో తెలుసుకుందాం.
ఈ సమ్మర్లో మెగా ఫ్యామిలీకి చెందిన నాలుగు సినిమాలు విడుదల కానుండటం విశేషం. వాటిలో ముందు చెప్పుకోవాల్సిన సినిమా పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీష్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమా ఇది. మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్‌కల్యాణ్ ఇందులో పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. ఇక ఈ వేసవిలో ప్రేక్షకులను పలకరించే మరో మెగా హీరో రామ్‌చరణ్. ఆయన ‘పెద్ది’ ఈ సమ్మర్లోనే విడుదల కానున్నది.
మార్చి 27న సినిమాను విడుదల చేయనున్నట్టు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఆ తేదీ మారే అవకాశం ఉంది. ఏదేమైనా సమ్మర్ విడుదల మాత్రం పక్కా. శ్రీకాకుళం నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో చరణ్ ఆటకూలీగా కనిపించబోతున్నారు. పానిండియా స్థాయిలో అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకుడు కాగా, జాన్వీ కపూర్ కథానాయిక. వెంకటసతీష్ కిలారు నిర్మాత. వీటితోపాటు సాయిధరమ్‌తేజ్ ‘సంబరాల యేటిగట్టు’, వరుణ్‌తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమాలు కూడా ఈ సమ్మర్లోనే రానున్నాయి. ఈ విధంగా నలుగురు మెగా హీరోలు ఈ వేసవిలో సందడి చేస్తారన్నమాట.