Nayanthara | దక్షిణాదిలో తిరుగులేని ఫాలోయింగ్‌తో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నది నయనతార. ఆమెను అభిమానులు లేడీ సూపర్‌స్టార్ అని పిలుచుకుంటారు. సౌత్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో సమానంగా ఈ భామ స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ‘జవాన్’ సినిమాతో నయనతార దేశవ్యాప్తంగా పాపురల్ అయింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు పది కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
తాజాగా యాభై సెకన్ల నిడివి కలిగిన ఓ కమర్షియల్ యాడ్ కోసం నయనతార ఏకంగా ఐదు కోట్లు పారితోషికం అందుకోవడం సంచలనంగా మారింది. దక్షిణాది పరిశ్రమలో ఇదొక అరుదైన రికార్డని, ఇప్పటివరకు ఏ కథానాయిక కమర్షియల్ యాడ్ కోసం అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను పొందలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డీటీహెచ్ సంస్థ టాటా స్కై కోసం రూపొందించిన యాడ్‌లో నయనతార నటించిందని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ప్రస్తుతం నయనతార టెస్ట్, మన్నన్ఘట్టి 1960, డియర్ స్టూడెంట్, తని ఒరువన్-2 చిత్రాల్లో నటిస్తున్నది.