Fish Venkat | టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్ జులై 18న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెంకట్ రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా డయాలసిస్ చేయాల్సి వచ్చేది. అయితే పరిస్థితి మరింత విషమించడంతో ఆయన మృతి చెందారు. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించినప్పటికీ, దాత దొరకకపోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో అవసరమైన చికిత్స అందించలేకపోయారు. ఈ విషయంలో తన తండ్రి ప్రాణాలను రక్షించలేకపోయామని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి ఎమోషనల్ అవుతూ చెప్పారు.
వైద్యానికి రూ. 50-60 లక్షలు అవసరం అని డాక్టర్లు చెప్పారు. మేము చాలా మందిని సంప్రదించాం, కానీ ఎలాంటి స్పందన రాలేదు. మంచు విష్ణుకు కాల్ చేసినా స్పందన లేదు. ఎవరికి కాల్ చేసినా ‘బయట దేశాల్లో ఉన్నారు’ అనే సమాధానమే వచ్చింది అని ఆమె వేదన వ్యక్తం చేశారు. ఇటీవల హీరో ప్రభాస్ వైపు నుంచి రూ. 50 లక్షల ఆర్థిక సహాయం వచ్చిందన్న వార్తలు వైరల్ అయినా, అది పూర్తిగా అబద్ధమని వెంకట్ కుటుంబం స్పష్టం చేసింది. ఆ వార్తల తర్వాత కూడా ప్రభాస్ టీంకి ఫోన్ చేశాం. ‘సార్‌తో మాట్లాడి చెబుతాం’ అన్నారు కానీ, తిరిగి కాల్ రాలేదు. మేము చేసిన ఫోన్లకు కూడా స్పందన రాలేదు. అయితే ఈ విషయం ప్రభాస్‌కి తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారు.
వైద్య ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్న ఫిష్ వెంకట్ కుటుంబానికి, కొంతమంది ప్రముఖులు సహాయం చేసినట్టు తెలుస్తోంది. హీరో విశ్వక్ సేన్ సహా మరికొందరు తమ వంతు చేయూతనిచ్చారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి స్పందించి, అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, సకాలంలో కిడ్నీ దాత దొరకకపోవడం, పరిస్థితి విషమించడం వల్ల వెంకట్ కన్నుమూసారు. రామ్ చరణ్‌కి చెందిన క్లింకార ఫౌండేషన్ నుండి పాతిక వేల రూపాయల సాయం అందిందని ఫిష్ వెంకట్ కూతురు పేర్కొంది. నాన్నకి అంత సీరియస్‌గా ఉంటే ఒక్కరు కూడా చూడడానికి రాలేదు. గబ్బర్ సింగ్ టీమ్ మాత్రమే వచ్చారు. డబ్బు సాయం చేసి ఉంటే నాన్న బ్రతికే వారు అని ఫిష్ వెంకట్ కూతురు వాపోయింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయడానికి తన కొడుకు ఎప్పుడూ ముందుండేవాడు, కానీ ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఫిష్ వెంకట్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.