దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ముంబయి నేపథ్యంలో 80వ దశకం నాటి ప్రేమకథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి యొక్క అసాధారణ ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. మంగళవారం కథానాయిక మీనాక్షి చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సుమతి పాత్రలో ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఓ భవంతి ముందు కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది. హృదయాన్ని స్పృశించే ప్రేమకథా చిత్రమిదని, అభినయ ప్రధానంగా సుమతి పాత్ర సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.