బాక్సింగ్, క్రికెట్, ఫుట్ బాల్, కబడ్డీ.. ఇలా స్పోర్ట్స్ నేపథ్యంతో ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. గానీ ఇప్పటిదాకా స్నూకర్ ఆట బ్యాక్ డ్రాప్ తో సినిమాలు రాలేదు. తొలిసారి ఆ ప్రయత్నం చేస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు మృదుల్. ‘తులసీదాస్ జూనియర్’ పేరుతో టీ సిరీస్ సంస్థతో కలిసి ప్రముఖ దర్శకుడు అషుతోష్ గోవారికర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దివంగత రాజీవ్ కపూర్, వరుణ్ బుద్ధదేవ్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
1994 సంవత్సరంలో జరిగే కథ ఇది. తండ్రి తులసీదాస్ స్నూకర్ క్రీడాకారుడు. ఓ కీలక మ్యాచ్ లో ఓడిపోయిన కారణంగా అతను బాధతో ఆటకు దూరమవుతాడు. విజేత కావాలనుకున్న తండ్రి కలను కొడుకు తులసీదాస్ జూనియర్ ఎలా నెరవేర్చాడు అనేది ఈ సినిమా కథ. తులసీదాస్ జూనియర్ పాత్రలో వరుణ్ బుద్ధదేవ్ నటించారు.
సంజయ్ దత్ పోషించిన పాత్ర కీలకంగా ఉండనుంది. రాజ్ కపూర్ కొడుకు రాజీవ్ కపూర్ నటించిన చివరి చిత్రమిదే. స్నూకర్ ఆట నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్తున్నారు చిత్రబృందం. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.