‘ఐదు వేల ఏళ్ల నుంచి కోట్లాది ప్రజలు ఆరాధించే అమరమైన పురాణేతిహాస గాధ ఇది. రామాయణం ఒక వాస్తవం. మన చరిత్ర. భారతీయ ధర్మానికి, త్యాగానికి ప్రతీక ఆ శ్రీరాముడు. అపరిమిత శక్తికి, ప్రతీకారేచ్ఛకు ప్రతినిధి రాక్షస రావణుడు. ఈ రెండు అత్యంతం ప్రబల శక్తుల కాలాతీత యుద్ధానికి వేదికగా, వెండితెర అపురూప దృశ్యకావ్యంలా రామాయణగాథను మీ ముందుకు తెస్తున్నాం’ అంటూ ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ పేరుతో విడుదల చేసిన ‘రామాయణ’ గ్లింప్స్ ఆద్యంతం అబ్బురపరిచేలా సాగింది.
భారతీయ ఇతిహాసగాథ రామాయణంను వెండితెర దృశ్యమానం చేస్తూ నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో రాముడిగా రణబీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణ పాత్రధారిగా యష్ కనిపించనున్నారు. ఈ సినిమా మొదటిభాగం 2026 దీపావళికి, ద్వితీయ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గ్లింప్స్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఐమాక్స్ ఫార్మాట్‌తో తెరకెక్కిన ‘రామాయణ’ గ్లింప్స్ ఆద్యంతం అధునాతన గ్రాఫిక్స్ హంగులతో అలరించింది. ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. మన సంస్కృతికి ఆత్మ వంటి రామాయణాన్ని అత్యంత శ్రేష్టతతో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు నితేశ్ తివారి తెలిపారు.