‘తెలుగు పరిశ్రమకు క్లాసిక్ చిత్రాల్ని అందించిన పూర్ణోదయ సంస్థలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా నాకు మంచి గుర్తింపును తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది’ అని అన్నారు హీరో శ్రీకాంత్ రెడ్డి. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ దర్శకులు. సెప్టెంబర్ 2న విడుదకానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘మాది హైదరాబాద్. అల్వాల్‌లో పుట్టిపెరిగాను. బీటెక్ చదువుతున్నప్పుడే సినిమాలపై ఆసక్తి కలిగింది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పూర్తి వినోదభరిత చిత్రం. నారాయణ్‌ఖేడ్ టౌన్లో పవన్‌కల్యాణ్ ‘ఖుషి’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కోసం శ్రీను అనే యువకుడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నదే చిత్ర కథాంశం.
నారాయణ్‌ఖేడ్, శంకర్పల్లి, చేవెళ్ల ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. అనుదీప్ నారాయణఖేడ్ ప్రాంతంలో పెరిగారు కాబట్టి ఆయన చూసిన సంఘటనలు, జ్ఞాపకాలతో ఈ కథ రాసుకున్నారు. నిజజీవితంలో నేను పవన్‌కల్యాణ్, సూర్యగారిని బాగా అభిమానిస్తాను. ఈ సినిమాలో తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటుడితో పనిచేయడంతో ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకున్నా. స్వతహాగా నాకు కామెడీ, లవ్‌స్టోరీస్ ఇష్టం’ అని చెప్పారు.