Spirit | రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ . ఈ మూవీ గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్ సెట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన చిత్ర బృందాన్ని ఒక్కసారిగా కలవరపరిచింది. సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో చిత్ర యూనిట్‌కు చెందిన ఒక సభ్యుడు స్వల్ప గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. అగ్ని ప్రమాదం కారణంగా సెట్లో ఏర్పాటు చేసిన కొన్ని టెంట్లు, అలాగే చిత్రీకరణకు ఉపయోగించే పరికరాలు కొంతవరకు దగ్ధమైనట్లు సమాచారం. అయితే పెద్ద ప్రమాదం తప్పిపోయిందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ ఘటన సమయంలో ప్రభాస్ సెట్లో లేకపోవడం అందరికీ ఊరటనిచ్చింది. గత కొద్ది రోజులుగా ఆయన లేకుండానే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. ఇటీవలే ఆయన ఒక విరామ యాత్ర ముగించుకుని వచ్చారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్‌ను పూర్తి చేశారు.ఇక రీసెంట్గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాన్ని వీక్షించారు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న వీరి చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి.
ఇక ప్రభాస్ నటించిన ‘ఫౌజీ’ చిత్రం ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభాస్ త్వరలోనే ‘స్పిరిట్’ చిత్రానికి కావలసిన తేదీలను కేటాయించనున్నాడు. ‘స్పిరిట్’ ఒక పోలీస్ నేపథ్య కథగా రూపొందుతుండగా, ఈ చిత్రాన్ని 2027 మార్చిలో విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఏది ఏమైన ‘స్పిరిట్’ షూటింగ్ సమయంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం పెద్ద నష్టాన్ని కలిగించకపోవడం ఊరటనిచ్చింది. త్వరలోనే చిత్రీకరణ మళ్లీ ప్రారంభమవుతుందని, సినిమా పనులు వేగంగా కొనసాగనున్నాయని సమాచారం.