బోయపాటి శీను, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం అఖండ . ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాలలో మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతుంది. అఖండ చిత్రం ఓ వైపు బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టిస్తుంటే, మరో వైపు “అఖండ” ప్రదర్శితం అవుతున్న మరో థియేటర్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తుంది.
వరంగల్లోని ఏషియన్ జెమిని థియేటర్లో గురువారం అఖండ సినిమా ప్రదర్శిస్తుండగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. సినిమా చూస్తుండగానే పొగలు రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు. వెంటనే థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు అప్రమత్తమైన థియేటర్ యజమాన్యం వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించిది. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
తాజాగా శ్రీకాకుళంలో “అఖండ”ను ప్రదర్శిస్తున్న రవిశంకర్ థియేటర్లోని సౌండ్ సిస్టమ్ మంటల్లో చిక్కుకుంది. సౌండ్ సిస్టమ్ లో హైవాల్యూమ్ పెంచడం వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనితో అభిమానులు థియేటర్ నిర్వాహకులు కొన్ని నిమిషాల పాటు ఆందోళనకు గురయ్యారు. స్క్రీనింగ్ మధ్యలో స్క్రీన్ వెనుక సౌండ్ సిస్టమ్లో మంటలను ప్రేక్షకులు గమనించడంతో భయంతో ఆడిటోరియం నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే థియేటర్ నిర్వాహకులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.