Ranjith Balakrishnan | మలయాళీ ఇండస్ట్రీలో మీటూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక అనంతరం పలువురు బాధితులు తమకు ఎదురైన వేధింపులను బయటపెట్టారు. ఆ తర్వాత పలువురిపై కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై మరో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ ఓ నటుడు ఆరోపించారు. ప్రస్తుతం, ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మలయాళీ అగ్రనటుడు మమ్ముట్టి నటించిన ఓ మూవీ సమయంలో వేధింపులకు పాల్పడినట్లు నటుడు పేర్కొన్నాడు.
2012లో కోజికోడ్‌లో షూటింగ్ సమయంలో దర్శకుడు రంజిత్‌తో పరిచయం ఏర్పడిందని.. ఈ క్రమంలో ఆడిషన్ సాకుతో బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలో ఉన్న హోటల్‌కు రమ్మన్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత గదిలోకి వెళ్లాక ఆడిషన్లో భాగమని చెప్పి దుస్తులు విప్పించి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు నటుడు గతవారం ఫిర్యాదు చేయగా.. తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు రంజిత్ బాలకృష్ణన్‌పై ఇంతకు ముందే బెంగాలీ నటి కోచి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. 2009లో పలేరి మాణిక్యం మూవీ ఆడిషన్స్ సమయంలో వేధింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమెపై పోలీసులు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.