Bastian In Bengaluru | బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ ‘బాస్టియన్’ (Bastian) బెంగళూరులో మరో వివాదంలో చిక్కుకుంది. అనుమతించిన సమయం కంటే ఎక్కువసేపు కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు, అర్ధరాత్రి పార్టీలకు అనుమతించి నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బెంగళూరు పోలీసులు ఈ రెస్టారెంట్‌పై ఎఫ్.ఐ.ఆర్. (FIR) నమోదు చేశారు.
సెయింట్ మార్క్స్ రోడ్లో ఉన్న ‘బాస్టియన్’ రెస్టారెంట్ డిసెంబర్ 11న రాత్రి 1.30 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది పోలీసులు ఇచ్చిన సమయానికంటే ఎక్కువ సేపు నిర్వహించినట్లు సమాచారం. దీంతో కర్ణాటక పోలీస్ చట్టంలోని సెక్షన్ 103 కింద సుమోటో ఫిర్యాదుల ఆధారంగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు మేనేజర్లు, ఇతర సిబ్బందిపై కేసులు నమోదు అయ్యాయి. ‘బాస్టియన్’తో పాటు, రెసిడెన్సీ రోడ్లో ఉన్న ‘సౌర్ బెర్రీ పబ్’ (Sour Berry Pub) పై కూడా కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా పబ్ సిబ్బందితో సహా ఎనిమిది మంది వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు.