Tollywood | పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ సర్కార్ ఎంచుకున్న మార్గం ‘డైవర్షన్ పాలిటిక్స్’. అందుకు సినీరంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను కలవరపరుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఓ ప్రణాళిక ప్రకారం రేవంత్ సర్కార్ సినీరంగంపై వేధింపులకు పాల్పడుతున్నదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఎప్పుడో ముగిసిపోయిన డ్రగ్స్ కేసును తిరగదోడతామని చేసిన బెదిరింపులు మొదలు నిన్నటి బెట్టింగ్ యాప్స్ వ్యవహారం వరకూ ప్రభుత్వం హిడెన్ అజెండాతో సినీ రంగాన్ని టార్గెట్ చేస్తున్నదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఓవైపు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇండస్ట్రీని వాడుకుంటూనే మరోవైపు సినీరంగంలోని తమ వ్యతిరేకులను దారికి తెచ్చుకునే వ్యూహంలో భాగమిదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో తెలుగు సినీరంగం స్థిరపడిన నాటి నుంచి ఏనాడు పరిశ్రమ ఈ స్థాయిలో రాజకీయపరమైన వేధింపులను ఎదుర్కోలేదని పలువురు సినీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ దేశంలో రెండో అతిపెద్ద సినీ ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ వంటి సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ట్రాప్‌లో పడి ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ యాప్స్‌కు వ్యతిరేకంగా అందరూ గళం విప్పాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న రానా, విజయ్ దేవరకొండ వంటి హీరోలు తాము స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రచారం చేశామని, వాటికి చట్టబద్దత ఉందని తమ పీఆర్ టీమ్స్ ద్వారా స్పందన తెలియజేశారు. వాటి తాలూకు కాంట్రాక్ట్ కూడా కొన్నేళ్ల క్రితమే ముగిసిందని వివరణ ఇచ్చారు. ఈ విషయాలన్నింటికి పరిగణనలోకి తీసుకోకుండా ఒక్కసారిగా పోలీసులు కేసు నమోదు చేయడమేంటని ఇండస్ట్రీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కచ్చితంగా రేవంత్ సర్కార్ ఆడుతున్న మరో డైవర్షన్ గేమ్ అని సోషల్‌మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
హైడ్రా ఆధ్వర్యంలో జరిగిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ నేలమట్టంతోనే ఇండస్ట్రీకి రేవంత్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిందన్నది ఇన్సైడ్ టాక్. జగన్‌తో నాగార్జునకు ఉన్న సాన్నిహిత్యాన్ని మనసులో పెట్టుకొని అమరావతి నుంచి అందిన ఆదేశాల మేరకు రేవంత్ సర్కార్ ఈ కూల్చివేతకు పాల్పడిందని సినీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇది జరిగిన కొద్ది మాసాలకే సమంతా విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలను ఒక్కసారిగా షాక్‌కి గురిచేశాయి. ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపై నిలిచి నాగార్జున కుటుంబానికి సంఘీభావం ప్రకటించింది. ఈ విషయంలో సినీరంగం ప్రదర్శించిన ఐక్యత రేవంత్ సర్కార్‌కు కంటగింపుగా మారిందని చెబుతారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి ‘పుష్ప-2’ విడుదలకు ముందు బెనిఫిట్‌షోలకు, టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులిచ్చింది. అయితే సినిమా విడుదల అనంతరం ఓ ప్రెస్మీట్లో అల్లు అర్జున్.. సీఎం రేవంత్ పేరు మర్చిపోవడం ఈ వివాదాన్ని మలుపుతిప్పిందంటారు. తన పేరునే మర్చిపోయాడనే కక్షతో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందని ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడిచింది.
తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేదని, ఇలాంటి సంఘటనల్లో సినీ హీరోను అరెస్ట్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని నాడు పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సినీ ప్రముఖులతో ఓ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం అల్లు అర్జున్ వివాదం మొత్తం సమసిపోయింది. ఈ మీటింగ్ పేరుతో రేవంత్ ఇండస్ట్రీతో ‘సెటిల్మెంట్’ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సినీరంగంపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టిందని చెబుతారు. పెద్ద హీరోల చిత్రాల విషయంలో బెనిఫిట్‌షోలకు అనుమతినిచ్చే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలో అన్ని ప్రభుత్వాలు సినీరంగం పట్ల సానుకూలంగానే స్పందించాయి. అయితే సంధ్య థియేటర్ ఘటన అనంతరం బెనిఫిట్షోలను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేసింది. ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి నామమాత్రంగా టికెట్ రేట్ల పెంపునకు అనుమతినిచ్చింది.
బెనిఫిట్‌షోల విషయంలో ప్రభుత్వ మొండి వైఖరి అగ్ర నిర్మాతలకు ఇబ్బందికరంగా మారింది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేపట్టే కాంపెయిన్ విషయంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. సినీ నటులు తప్పకుండా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనాలని, అందుకు సంబంధించిన వీడియోలు చేయాలని, లేని పక్షంలో వారి సినిమాలకు అనుమతులు ఇవ్వమని ఓ సభలో సీఎం రేవంత్ హెచ్చరించడం పరిశ్రమ వర్గాల్లో భయాల్ని రేకెత్తించింది.
ఇటీవల తెలుగు సినిమా పాటల్లో అసభ్యకరమైన డ్యాన్స్ స్టెప్పులు ఉంటున్నాయని, ఇండస్ట్రీ పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ ఆదేశించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అసభ్యకరమైన డ్యాన్సుల విషయంలో తమకు ఫిర్యాదులు అందాయని కమిషన్ పేర్కొంది. ‘సినిమా కంటెంట్ నియంత్రణ విషయాన్ని సెన్సార్ బోర్డ్ చూసుకుంటుంది. ఏమైనా అభ్యంతరకరమైన మాటలు, సన్నివేశాలు, డ్యాన్సులు ఉంటే తొలగించే అధికారం సెన్సార్ బోర్డ్‌కు ఉంటుంది. ఎప్పుడూ లేనిది సినిమాల విషయంలో మహిళా కమిషన్ వార్నింగ్ ఇవ్వడం అర్థం కావడం లేదు.
ఇలా జరగడం ఇదే తొలిసారి’ అంటూ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు తెలుగు సినీరంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ‘ఇవన్నీ గమనిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రీని ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో సినీరంగాన్ని టార్గెట్ చేయలేదు’ అని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ముందు కేసుల రూపంలో ఎలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సివస్తుందోనని పలువురు దర్శకనిర్మాతలు, నటీనటులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రచారం నిర్వహించారు. ఆ కంపెనీలను చట్టప్రకారమే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆయన ఏ ప్రకటన చేసినా, కంపెనీకి ప్రచారకర్తగా ఉన్న సదరు సంస్థ న్యాయపరంగా వ్యవహరిస్తున్నదా? లేదా? అనే విషయాన్ని విజయ్ టీమ్ పరిశీలిస్తుంది. కంపెనీ లేదా ఉత్పత్తి చట్టప్రకారం ఉందని తెలిసిన తర్వాతే విజయ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారు.
అలాంటి అన్ని అనుమతులు ఉన్న ఏ23 అనే సంస్థకు, బ్రాండ్‌కు విజయ్ అంబాసిడర్‌గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో గౌరవనీయ సుప్రీంకోర్డు కూడా తెలియజేసింది. ఏ23 అనే కంపెనీతో విజయ్ ఒప్పందం గత ఏడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. విజయ్‌దేవరకొండ విషయంలో పలు మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన ప్రచారకర్తగా వ్యవహరించలేదు
– టీమ్ విజయ్ దేవరకొండ
స్కిల్‌బేస్డ్ ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని గడువు 2017లో ముగిసింది. చట్టబద్ధంగా ఆమోదం ఉన్న ఆన్లైన్ నైపుణ్య ఆధారిత గేమ్‌లకే రానా ప్రచారకర్తగా వ్యవహరించారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయబృందం అన్నింటికి క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. చట్టానికి పూర్తి అనుగుణంగా ఉన్న ప్లాట్‌ఫామ్‌నే రానా అంగీకరించారు.
-రానా పీఆర్ టీమ్
ఈ యాడ్ 2016లో నా దగ్గరకు వచ్చింది. అది చేయడం తప్పని కొద్ది నెలల్లోనే తెలుసుకున్నా. 2017లో నా అగ్రిమెంట్‌ను పొడిగిస్తానని వాళ్లు అడిగితే ‘యాడ్ తెలియక చేశాను. ఏడాది అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి వెంటనే దాన్ని ఆపమని మీకు చెప్పలేకపోయా. ఇక ఆ యాడ్‌ను ప్రసారం చేయొద్దు. నేను నటించను’ అని చెప్పాను. దీని తర్వాత ఏ గేమింగ్ యాప్‌లకు ప్రచాకర్తగా పనిచేయలేదు. 2021లో ఆ కంపెనీ మరో కంపెనీకి అమ్మెస్తే సోషల్‌మీడియా వేదికలో నా ప్రకటన వాడారు. వాళ్లకు లీగల్ నోటీసులు పంపాను. వెంటనే వాళ్లు ఆపేశారు. ఇప్పుడు మళ్లీ అది లీకైంది. అందువల్లే ఈ సమాధానం చెబుతున్నా’
– ప్రకాష్‌రాజ్