Final Destination Bloodlines | హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్ ‘ఫైనల్ డెస్టినేషన్ – బ్లడ్లైన్స్’ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ చిత్రం అక్టోబర్ 16న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇండియాలో మంచి వసూళ్లను రాబట్టింది. తొలిరోజే ఏకంగా రూ. 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. దీంతో ఇండియాలో హాలీవుడ్ హర్రర్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో ‘ది కాంజురింగ్’ సిరీస్ సినిమాలు టాప్-3లో ఉన్నాయి. ‘ది నన్’ చిత్రం రూ. 10.80 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ‘ది కాంజురింగ్ 2’ రూ. 7 కోట్లు, ‘అన్నాబెల్లే: క్రియేషన్’ రూ. 6 కోట్లతో ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి ఆడమ్ స్టెయిన్ & జాక్ లిపోవ్స్కీ సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. బుసిక్ & లోరి ఎవాన్స్ టేలర్ స్క్రీన్ ప్లే అందించారు. కైట్లిన్ శాంటా జువానా, టెయో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్, అన్నా లోరే ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇండియాలో ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్కు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. 2011లో విడుదలైన ‘ఫైనల్ డెస్టినేషన్ 5’ ఇండియాలో కేవలం రూ. 7.65 కోట్లు మాత్రమే వసూలు చేసింది.