అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’తో ఈ ఏడాది దసరా బరిలోకి దిగబోతున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ‘హరిహరవీరమల్లు’ చిత్రం నిరుత్సాహపరచడంతో పవన్ అభిమానులు ‘ఓజీ’పై భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగానే ప్రచార చిత్రాలు హైప్‌ను క్రియేట్ చేశాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ‘ఓజస్ గంభీర’ అనే పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. పగ, ప్రతీకారం ప్రధానాంశాలుగా ముంబయి నేపథ్యంలో కథ సాగుతుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని, త్వరలో పవన్‌కల్యాణ్ ఈ షూట్లో పాల్గొంటారని చెబుతున్నారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.