దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలం విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌర్జన్యపూరిత వైఖరిని పలువురు సినీప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ఆక్షేపించారు. వన్యప్రాణుల ఆక్రందనల నడుమ పచ్చటి అడవిని జేసీబీలతో నేలమట్టం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘సేవ్ గ్రీన్లంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ అంటూ సోషల్‌మీడియా వేదికగా నినదించారు. వేలానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ‘సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ విధ్వంసం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది మంచిది కాదు. ఈ అరాచకానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులు, పౌరుల పక్షాన నేను నిలబడతాను. వారి నిరసనకు అందరూ మద్దతు ప్రకటించాలని, మన భవిష్యత్తు కోసం కదిలిరావాలని ప్రజలను కోరుతున్నా’ అంటూ ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ‘సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’ ‘ఆక్సిజన్ నాట్ ఆక్షన్’ ‘సేవ్ హెచ్‌సీయూ’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్‌ను లక్షల మంది వీక్షించారు.
సీనియర్ నటి రేణూ దేశాయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వరుస వీడియోలతో హెచ్‌సీయూ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు అందరూ ఉద్యమించాలని కోరింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఒక్క దుప్పి కూడా లేదని చెప్పిన సీఎం రేవంత్ స్టేట్మెంట్ను ఉటంకిస్తూ దుప్పుల మంద ఉరుకుతున్న వీడియోను షేర్ చేసింది. ‘ఒక్కసారి ఈ వీడియోను సీఎం రేవంత్‌రెడ్డికి పంపించండి’ అని రేణూదేశాయ్ కోరింది. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసకాండలో అడవిలోని మూగజీవులు ఎక్కడికి వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నాయని రేణూదేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. అడవి నేలమట్టంతో హెచ్‌సీయూ భూములనే కాదు నగరంలోని కోటి 20లక్షల మంది ప్రజల గ్రీన్లంగ్స్ను కూడా ధ్వంసం చేస్తున్నారంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.
హెచ్‌సీయూ భూముల వేలానికి వ్యతిరేకంగా అగ్ర దర్శకుడు నాగ్అశ్విన్ గతంలోనే స్పందించారు. 400 ఎకరాల భూమిని అమ్ముకోవడం మనఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ప్రకాష్‌రాజ్, రేణూదేశాయ్ ఈ ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. అడవి ధ్వంసం అవుతుంటే నెమళ్ల ఆక్రందనలు ప్రతిధ్వనిస్తున్నాయి, ఈ వేలాన్ని ఆపాలి అంటూ ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, ఫరియా అబ్దుల్లా, రష్మి, అనసూయ వంటి తారలు హెచ్‌సీయూ భూముల వేలానికి వ్యతిరేకంగా స్పందించారు. ‘ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ’ ‘సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టారు. వీరితో పాటు సినీరంగంలోని పలువురు యువ హీరోలు, దర్శకనిర్మాతలు కూడా హెచ్‌సీయూలో విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యం, గ్రీన్ కారిడార్ విధ్వంసం పట్ల ఆగ్రహంగా ఉన్నారు.