Film Chamber | తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కార్మికుల వేతనాల పెంపునకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నాలుగు ప్రధాన షరతులతో కూడిన ఒక లేఖను ఫిల్మ్ ఫెడరేషన్‌కు పంపింది. ఈ ప్రతిపాదనలపై సోమవారం ఫెడరేషన్‌కు చెందిన 24 యూనియన్లు సమావేశమై చర్చించనున్నాయి.
ఫిల్మ్ ఛాంబర్ పంపిన షరతులు చూసుకుంటే.. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అంటే 12 గంటల పనిని ఒక కాల్ షీట్‌గా పరిగణించాలని తెలిపింది. అలాగే రెండో ఆదివారం కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించాలి. 2022 జూలైలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఫైటర్స్, డాన్సర్స్ కోసం నిర్ణయించిన రేషియోలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయడం లేదు. దీనిని తప్పనిసరిగా పాటించాలి. జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 ప్రకారం, తమ సినిమా కోసం నైపుణ్యం ఉన్న ఏ వ్యక్తినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉండాలి. ఈ షరతులను అంగీకరిస్తే, కార్మికుల వేతనాలను పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది.
రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువ సంపాదించే కార్మికులకు మొదటి ఏడాది 10 శాతం, తర్వాతి రెండు సంవత్సరాలకు అదనంగా 5 శాతం చొప్పున వేతనాలు పెంచడానికి నిర్మాతలు ప్రతిపాదించారు. అలాగే రోజుకు రూ. 2000-రూ. 5000 మధ్య సంపాదించే కార్మికులకు మూడు సంవత్సరాల పాటు 5 శాతం చొప్పున వేతన పెంపును నిర్ణయించారు. అయితే, తక్కువ బడ్జెట్ చిత్రాలకు మాత్రం ఈ వేతన పెంపు వర్తించదు. ఆ సినిమాలకు ప్రస్తుత వేతనాలే అమల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఫిల్మ్ ఫెడరేషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే సినిమా పరిశ్రమలో వేతనాల పెంపు క్లారిటీ రాబోతుంది.