Suraksha Bandhu Committee | మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. అయితే ఈ కమిటీ అడుగుజాడల్లో ఇప్పుడు ఇతర సినీ పరిశ్రమలు కూడా మహిళల భద్రత కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా బెంగాలీ చిత్ర పరిశ్రమ (టాలీవుడ్)లో కూడా మహిళల భద్రత కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. సినీ పరిశ్రమలో పనిచేసే చోట మహిళలకు భద్రత కల్పించేందుకు ఫెడరేషన్ ఆఫ్ సినీ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా నేతృత్వంలో ‘సురక్షా బంధు కమిటీ’ ఏర్పాటైంది. ఈ కమిటీ తన పని కూడా ప్రారంభించినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు స్వరూప్ బిస్వాస్ సరబ్ అధికారికంగా ప్రకటించారు.
ఫెడరేషన్ అధ్యక్షుడు స్వరూప్ బిస్వాస్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెక్నీషియన్లు, స్క్రీన్ వర్కర్లతో పాటు ఆర్టిస్ట్ ఫోరమ్ కూడా కమిటీలో భాగం కావచ్చని ఆయన అన్నారు. లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి పేరుని కాని, వారి వివరాలను కానీ ఫెడరేషన్ గోప్యంగా ఉంచుతుంది. ఈ ఫెడరేషన్‌కు కోల్‌కతా పోలీసులతో పాటు ప్రభుత్వం మద్దతు ఉన్నట్లు బిస్వాస్ అన్నారు.