భారతీయ సినీచరిత్రలో కరణ్ జోహార్‌ది ప్రత్యేక స్థానం. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా ఆయన ప్రస్థానం అసామాన్యం. ‘తండ్రి’గానూ.. ఆయన ప్రయాణం ఎంతో విభిన్నం. సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన కరణ్.. ‘ఫాదర్స్‌డే’ సందర్భంగా తన పాడ్‌కాస్ట్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాడు. ఆధునిక పేరెంటింగ్, కుటుంబ వ్యవస్థ, పిల్లలను పెంచడంలో ఉండే బాధ్యతలు, భావోద్వేగాలను ఈ సింగిల్ ఫాదర్ తన అభిమానులతో పంచుకున్నాడు.
తన కవలలు యష్-రూహి.. తాము ఎలా పుట్టామని అడిగితే.. ‘మీరు నాన్న గుండెలోంచి వచ్చారు’ అని కవితాత్మకంగా చెబుతాడట. అయితే, వాళ్లు పెద్దయ్యాక ఈ సమాధానం సరిపోదనీ, వాళ్లు ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చారో, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని అంటున్నాడు. పేరెంటింగ్ అంటే నిజం చెప్పడం.. నిజాయతీగా ఉండటం అంటున్నాడు. ఇక పిల్లలను తన తల్లి సంరక్షణలో పెంచడం.. తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని చెబుతున్నాడు. “ఒంటరి తండ్రిగా కవలలను పెంచడం అంత సులభం కాదు.
కానీ, వారిని మా అమ్మ దగ్గర పెంచడం నా జీవితంలో నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం” అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు. ఇక కుటుంబ వ్యవస్థ గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ.. “అందరూ పరిపూర్ణ కుటుంబంలోనే పుట్టలేరు. కానీ, కొందరు అదృష్టవంతులు మాత్రమే సంపూర్ణ కుటుంబాన్ని నిర్మించుకుంటారు. నేనుకూడా అలాంటి అదృష్టవంతుణ్నే అని భావిస్తున్నా! గౌరీ ఖాన్, ఫరాఖాన్, నేహా ధూపియా, శ్వేతా బచ్చన్, కాజల్ ఆనంద్.. ఇలా నా స్నేహితులంతా నా కుటుంబసభ్యులే! నాకు తోబుట్టువులు లేరు.
వీళ్లే నాకు దొరికిన తోబుట్టువులు!” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తన పిల్లలకు ‘తల్లి ప్రేమ’కు దూరంగా ఉంటున్నామనే ఊహకూడా రాదనీ, వారిపై తన తల్లితోపాటు తన మిత్రబృందం కూడా అంతులేని ప్రేమను కురిపిస్తుందని అంటున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. బీటౌన్‌కు సరికొత్త ప్రేమకథా చిత్రాలను పరిచయం చేశాడు కరణ్. షారుక్ ఖాన్, కాజల్ జంటగా.. 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతా హై’ దర్శకుడిగా కరణ్ మొదటి సినిమా. ఆ తర్వాత కభీ ఖుషి కభీ గమ్, మై నేమ్‌ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, బాంబే టాకీస్, ఘోస్ట్ స్టోరీస్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించాడు.