Farah Khan Chhapri Comments | ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నిర్మాత ఫరా ఖాన్ మతపరమైన వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే ఆమె సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ అనే టీవీ షోలో హోలీ పండుగ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆమె మాట్లాడుతూ.. సారే చాఫ్రీ లోగోన్ కా ఫేవరెట్ ఫెస్టివల్ హోలీ హోతా హై. అని అన్నారు. దీని అర్థం హోలీ అనేది చాఫ్రీ(Chhapri) అనే ప్రజలకు ఇష్టమైన పండుగ. చాఫ్రీ అనే పదం ఇండియాలో అవమానకరంగా లేదా తక్కువస్థాయి వ్యక్తులను సూచించే పదంగా వాడుతుంటారు. దీంతో ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. హోలీ వంటి హిందూ పండుగను ఫరా అవమానించారని, ఆమె వ్యాఖ్యలు మతపరమైన సెంటిమెంట్స్‌ను గాయపరిచాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, #FarahKhan, #HoliControversy వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
మరోవైపు ఫరా వ్యాఖ్యలు ఒక వర్గాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని పేర్కొంటూ వికాశ్ అనే వ్యక్తి ముంబయిలోని ఖర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె వ్యాఖ్యలు తన మతపరమైన భావాలను గాయపరిచాయని, హిందూ సమాజాన్ని కూడా అవమానించాయని వికాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ ఫరాపై కేసు నమోదు అయ్యింది. ఇదిలావుంటే ఈ వివాదంపై ఫరా ఖాన్ ఇంకా స్పందించలేదు.
కొరియోగ్రాఫర్‌గా బాలీవుడ్లో కెరీర్‌ను ప్రారంభించింది ఫరాఖాన్. 1992లో వచ్చిన జో జీతా వోహీ సికందర్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం తన కొరియోగ్రఫీతో దిల్ సే, కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, బాంబే, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి అనేక సినిమాలకు బ్లాక్ బస్టర్లను అందించింది. 2004లో షారుఖ్ ఖాన్ నటించిన మైన్ హూన్ అనే సినిమాతో మెగా ఫోన్ పట్టింది ఫరా. ఆ తర్వాత 2007లో షారుఖ్ నటించిన ఓం శాంతి ఓంతో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాతోనే దీపికా పదుకోనేను బాలీవుడ్‌కు పరిచయం చేసింది.