భారీ తారాగణంతో వచ్చే సినిమాలపై ప్రేక్షకులతోపాటు సినీ తారలూ ఆసక్తి చూపుతారు. ‘ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై వీక్షిద్దామా?’ అని కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తుంటారు. ప్రీమియర్ షోలు వేస్తున్నారంటే.. ఎగబడిమరీ వెళ్తుంటారు. అయితే, షారుక్ ఖాన్-దీపికా పదుకొణె జంటగా ఫరాఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రీమియర్ షో మాత్రం.. అందుకు భిన్నంగా సాగిందట. షో మొదలైన ఐదు నిమిషాలకే.. సినిమా తారాగణమంతా నిద్రలోకి జారిపోయిందట.ఈ విషయాన్ని ఇటీవల సినిమా దర్శకురాలు ఫరాఖాన్ వెల్లడించింది.
‘హ్యాపీ న్యూ ఇయర్ కోసం మేము చాలా కష్టపడ్డాం. వరుసగా 40 రోజులపాటు భారత్‌లోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్లు నిర్వహించాం. ఆ తరవాత మరో 20 రోజులు విదేశాల్లోనూ పర్యటించాం. ప్రమోషన్ల కోసం ఒక టీవీ షోను కూడా ప్రారంభించాం. ఇక సినిమా ప్రీమియర్ షోను దుబాయ్‌లో ఎంతో గ్రాండ్‌గా ఏర్పాటుచేశాం. సినిమాలో నటించిన సూపర్ స్టార్లందరూ దీనికి హాజరయ్యారు.
వాళ్లంతా సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తి చూపారు. ఉత్సాహంగా ముందు వరుసలో కూర్చున్నారు. కానీ, షో ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఎందుకంటే.. క్షణం తీరికలేకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. రాత్రిపూట అలా కుర్చీల్లో కూర్చోగానే.. కావాల్సినంత విశ్రాంతి దొరికినట్లు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది ఫరాఖాన్. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
తమకు అంతమంచి అవకాశం ఇస్తే.. కుర్చీల్లోంచి లేవకుండా చూసేవాళ్లమని కామెంట్లు పెడుతున్నారు. 2014లో షారుక్, దీపిక జంటగా తెరకెక్కిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ.400 కోట్లదాకా కలెక్ట్ చేసింది. 2014లో అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.