Ram Charan | ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ గెస్ట్లుగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల నివారణ పోరాటంలో అందరం ఐక్యంగా నిలబడాలని వాటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పోరాడాలంటూ పిలుపునిచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అయితే కార్యక్రమం చివర్లో అందరూ డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో రామ్ చరణ్ కొద్దిగా అసౌకర్యంగా ఉన్నట్టు వీడియోల్లో కనిపించింది. ముఖ్యంగా ఆయన చేతికి ఉన్న కట్టు అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో, రామ్ చరణ్‌కు ఏమైంది? ఎందుకు బ్యాండేజ్ కట్టుకున్నారు? అనే సందేహాలు అభిమానులలో ఊపందుకున్నాయి. కొంతమంది ఈ గాయం ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో తలెత్తిందని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ గాయం గురించి అధికారికంగా ఏ సమాచారం వెలువడలేదు. అయితే గాయం అంత తీవ్రమైందిగా కనిపించడం లేదు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొంత నిరాశకి గురైన రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను షెడ్యూల్‌కు అనుగుణంగా పూర్తి చేసి విడుదల చేయాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాడు.
‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.రంగస్థలం రేంజ్లో మూవీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.