Faima | బుల్లితెర ప్రేక్షకులను తన ప్రత్యేకమైన యాస, కామెడీ టైమింగ్, ఊరమాస్ పంచ్‌లతో అలరించిన ప్రముఖ లేడీ కమెడియన్ ఫైమా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను ఫైమా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పటాస్’ కామెడీ షోతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఫైమా, చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలంగాణ యాస, సహజమైన నటన, కామెడీ పంచ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తర్వాత ‘జబర్దస్త్’ వేదికగా మరింత పాపులర్ అయ్యింది.
అనంతరం ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో పాల్గొని తన వ్యక్తిత్వం, ఆటతీరుతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం బుల్లితెరలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఫైమా, ప్రవీణ్ నాయక్ జూన్ 23న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలకు దూరంగా చాలా సింపుల్‌గా ఈ వివాహం జరిగినట్లు సమాచారం. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఫైమా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి అనంతరం ఫైమా చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వాళ్లు మమ్మల్ని అవమానించారు.. మిమ్మల్ని శాసించారు. మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించారు. కానీ ప్రేమ మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎంతో సహనం, ఎన్నో కష్టాలు, వదిలేయడానికి వేల కారణాలు ఉన్నా మేము ప్రతిరోజూ ఒకరినొకరం ఎన్నుకున్నాం. ఈ రోజు మేము భార్యాభర్తలం అంటూ ఫైమా భావోద్వేగంగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫైమా, ప్రవీణ్ నాయక్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపించేది. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగిందని సమాచారం. అనేక ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనా ఇద్దరూ తమ బంధాన్ని కొనసాగించారని, చివరకు పెళ్లితో ఒక్కటయ్యారని వారి సన్నిహితులు చెబుతున్నారు. ‘జబర్దస్త్’ వేదికపై ఫైమా, ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వీరి కెమిస్ట్రీకి మంచి స్పందన రావడంతో అప్పట్లోనే ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వినిపించాయి. ఆన్‌స్క్రీన్‌లో కనిపించిన అనుబంధం ఆఫ్‌స్క్రీన్‌లోనూ నిజమైందని అభిమానులు ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు.