Fahadh Faasil | కొందరు సెలబ్రిటీలు ఎంత ఎదిగిన కూడా తమ సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా మలయాళ స్టార్ నటుడు కూడా చాలా సింప్లిసిటీని మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపించి వార్తలలోకి ఎక్కాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో వరుసగా హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘పుష్ప’లో విలన్ పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్ను ఈ నటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రంలోనూ కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఫహద్ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇటీవల మలయాళంలో నటిస్తున్న నజ్లెన్ కొత్త సినిమా ‘మాలీవుడ్ టైమ్స్’ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫహద్ ఫోన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అతని చేతిలో ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ప్రముఖులు ఖరీదైన స్మార్ట్ఫోన్లతో కనిపిస్తుంటే… ఫహద్ మాత్రం ఒక సాధారణ ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫోన్ ఏమిటా అని నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుండగా, చివరికి ఆ ఫోన్ వివరాలు వెలుగు చూశాయి.
ఫహద్ ఫాజిల్ ఉపయోగిస్తున్న ఫోన్ చిన్న కీప్యాడ్ ఫోన్ కాదట. అది గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ “వెర్టు” తయారు చేసిన Vertu Ascent Ti Ferrari Nero Limited Edition ఫోన్. ధర: సుమారుగా $1199 (దాదాపు రూ1 లక్షకు పైగా) ఉంటుందట. 2008లో ఇది లాంచ్ కాగా, టైటానియం బాడీ, స్క్రాచ్-రెసిస్టెంట్ నీలమణి క్రిస్టల్ డిస్ప్లే, ఫెరారీ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో ఉంటుంది. సింబియన్ ఓఎస్ ఆధారంగా కస్టమ్ వెర్టు ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది. ఫహద్ ఫాజిల్ స్వభావానికి తగ్గట్టుగానే, ఆయన ఫోన్ ఎంపిక ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.