‘ప్రేమ, స్నేహం, కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథ ఇది. ముగ్గురు స్నేహితులు అనుకోకుండా విడిపోతారు. దానికి కారణమేంటి? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. ఇందులో కొంతమేర ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. నిజజీవిత సంఘటనల ఆధారంగా చేసిన సినిమా ఇది’ అని దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దేవగుడి’ చిత్రం ఈ నెల 30న థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో దర్శక, నిర్మాత రామకృష్ణారెడ్డి, ఇందులో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన రఘు కుంచె విలేకరులతో మాట్లాడారు.
రఘు కుంచె మాట్లాడుతూ ‘ఇందులో దేవగుడి వీరారెడ్డిగా కనిపిస్తాను. చాలా పవర్ఫుల్ పాత్ర. ఎంజాయ్ చేస్తూ చేశాను. రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యాక్షన్ డ్రామా ఇది. బెల్లం రామకృష్ణారెడ్డి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ఇలా అందరూ చక్కగా నటించారు. సంగీత దర్శకుడు మదీన్ మంచి సాంగ్స్ చేశాడు. నేను ఓ పాటను కంపోజ్ చేసి పాడాను. అందరికీ కనెక్టయ్యే ఎమోషనల్ మూవీ ఇది’ అని పేర్కొన్నారు.