F3 Movie | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి అంచనాలతోనే వస్తున్న చిత్రం ఎఫ్3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. 2019లో సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఎఫ్-2 చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంపై మొదటి నుంచే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఎప్పటికప్పుడు అప్డేట్లను ఇస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. పూజాహెగ్డే నర్తించిన ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో మే 17న విడుదల కానుంది. ఈ ప్రోమోలో వెంకటేష్, వరుణ్, పూజా వేసిన చిందులు అలరిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, రాహుల్ సిప్లీగంజ్, గీతా మాధురి ఆలపించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. వెంకీ, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించారు. సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు.