నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే తదితరులు
సాంకేతిక విభాగం: సంగీతం – దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ – సాయి శ్రీరామ్, ఆర్ట్ – ఎఎస్ ప్రకాష్, ఎడిటర్ – తమ్మిరాజు, సమర్పణ – దిల్ రాజు, నిర్మాత – శిరీష్, బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సహా నిర్మాత – హర్షిత్ రెడ్డి, కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం – అనిల్ రావిపూడి
సమ్మర్ సీజన్ కు సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చిన భారీ చిత్రం ఎఫ్ 3. గత సినిమా ఎఫ్ 2 మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ కొత్త సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. వెంకటేష్ వరుణ్ తేజ్ తమన్నా, మెహరీన్ వంటి స్టార్ కాస్ట్ తో పాటు భారీ తారాగణం ఉండటం సినిమాకు ఆకర్షణ అయ్యింది. నిర్మాతగా దిల్ రాజు గుడ్ విల్ సినిమా విజయం మీద నమ్మకం పెంచింది. ఇన్ని అట్రాక్షన్స్ తో ఇవాళ తెరపైకి వచ్చిన ఎఫ్ 3 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథేంటంటే
ఆర్టీఏలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న వెంకీ (వెంకటేష్)కు సవతి తల్లి, చెల్లెళ్లలో ఇంటినిండా కష్టాలే. లేచినప్పటి నుంచి డబ్బు కోసం కుటుంబ సభ్యులు అతన్ని వేధిస్తుంటారు. దీంతో త్వరగా డబ్బు సంపాదించి గొప్పవాడు కావాలని దగ్గరి దారులు వెతుకుతుంటాడు. ఓ పెద్ద బిజినెస్ మేన్ అవ్వాలని కలగనే వరుణ్ (వరుణ్ తేజ్) డబ్బు తానే సంపాదించాల్సిన పనిలేదని, ఓ డబ్బు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ధనవంతుడు కావొచ్చని అనుకుంటాడు. ఇవే ఆలోచనలతో మంగ టిఫిన్ సెంటర్ నడిపే హనీ (మెహరీన్), ఆమె కుటుంబ సభ్యులు ఉంటారు. ధనవంతుల ఇంట్లో పనిచేసే మెహరీన్, డబ్బున్న అమ్మాయిగా నాటకమాడి వరుణ్ ను ఆకర్షిస్తుంది. ఆమె కోసం వరుణ్ కూడా కోటీశ్వరుడిగా నటిస్తుంటాడు. ఈ క్రమంలో వెంకీ, వరుణ్ కలిసి అప్పులు చేసి మరీ హనీకి విలాసవంతమైన వస్తువులు కొనిస్తుంటారు. ఒక రోజు ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసి షాక్ అవుతారు. అప్పులు తీర్చడం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక వీడియో వీరి కంట పడుతుంది. అందులో పేరున్న వ్యాపారవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ) చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కొడుకు కోసం వెతుకుతున్నాడని తెలుసుకుంటారు. ఆ కొడుకుగా తామే వెళ్తే ఆస్తికి వారసులు కావొచ్చని ప్లాన్ వేస్తారు. డబ్బు కోసం వెంకీ, వరుణ్, హనీ ఆమె ఫ్యామిలీ వేసిన ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? లేదా? అనేది తెరపై చూడాలి.
ఫ్లస్ పాయింట్స్
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా నటన
కావాల్సినంత వినోదం
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
తెలిసిన సన్నివేశాలు
లాజిక్ లేని పాత్రలు
ఎలా ఉందంటే
కామెడీ ఫార్ములాలు అన్నీ పోగేసి రాసుకున్న కథ ఇది. నత్తి, రేచీకటి, డబ్బు కోసం దగ్గరి దారులు వెతకడం, ఆస్తికి వారసులం అంటూ నమ్మించే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ గతంలో చూసిన సినిమాల్లో నుంచి స్ఫూర్తి పొందినవే. వీటికి ఎఫ్ 2 బేస్ మెంట్ ఉండటంతో ఆ పాత్రలు, అందులో బాగా పేరొచ్చిన సన్నివేశాలను తిరగరాసి ఇక్కడా వాడుకున్నారు. దాంతో అప్పటికే నవ్వించిన ఆ సన్నివేశాలు ఇందులోనూ హ్యూమర్ తీసుకొచ్చాయి. సందర్భానుసారం పాటలను నేపథ్య సంగీతంలా పెట్టారు. నవ్వించే ప్రయత్నంలో ఇదీ భాగమే అయ్యింది. సాదాసీదా సన్నివేశాలు కూడా స్టార్స్ చేస్తే ఆకట్టుకుంటాయి. పేరున్న నటీనటులతో వచ్చే ఈ అదనపు లాభం ఎఫ్ 3కి బాగా కలిసొచ్చింది. డబ్బున్న వారిలా హీరో హీరోయిన్సు నటించడం ఆ తర్వాత వాళ్లు పేదవాళ్లని తెలుసుకుని షాక్ అవడం మన ప్రేక్షకులు చూడటం కొత్తకాదు. అయితే అందులో వరుణ్ తేజ్, మెహరీన్, వెంకటేష్, తమన్నా లాంటి వాళ్లు నటించడం వల్ల వాళ్ల పర్మార్మెన్స్ లతో మెప్పించారు.
దర్శకుడు అనిల్ రావిపూడి కథకు చిన్న సోల్ క్రియేట్ చేసి మిగతా అంతా నవ్వులతో నింపేశాడు. కథలో ఉన్న స్పేస్ నంతా నవ్వించేందుకే ఉపయోగించుకున్నాడు. ఆయన రాసిన మాటలు, సృష్టించిన, పాత్రలు, సన్నివేశాలు వినోదాన్ని పంచాయి. ఇంటర్వెల్ ముందొచ్చే సీన్స్ బాగా నవ్విస్తాయి. సెకండాఫ్ బుల్ ఫైట్, బొమ్మల సేల్స్ సన్నివేశాలను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. తమ హీరోయిజం మర్చిపోయి దర్శకుడు చెప్పినట్లల్లా చేస్తూ సినిమాను నిలబెట్టారు వెంకటేష్, వరుణ్ తేజ్. నాయికలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ పాత్రల మేరకు బాగా నటించారు. తమన్నా ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. తన కెరీర్ లో ఇప్పటిదాకా చేయని ఓ రోల్ ప్లే చేసింది. అది తెరపైనే చూడాలి. ఆనంద్ ప్రసాద్ పాత్రలో హుందాగా నటించారు మురళీ శర్మ. చివరలో ఆయన పాత్రే కథకు వెన్నెముకలా నిలుస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, తమ్మిరాజు ఎడిటింగ్ ఇతర సాంకేతిక నిపుణుల పనితనం ప్రతి సన్నివేశంలో కనిపించింది.
చివరగా.. నవ్వుల మ్యాజిక్
రేటింగ్: 3/5