మాజీ డ్రీమ్ గాళ్ హేమమాలిని సినిమా వయసు.. యాభై అయిదు. ఆ సందర్భంగా అభిమానులు, ఆత్మీయులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా, మంచి కథలు వస్తే మాత్రం సినిమాలు చేస్తానని అంటున్నారామె. ‘సరిగ్గా యాభై అయిదేండ్ల క్రితం నా సినీ జీవితం మొదలైంది. మొదట్లో, జనాలు నన్ను పిచ్చిపిచ్చిగా అభిమానిస్తున్న విషయమే అర్థమయ్యేది కాదు. పని ధ్యాసలో పడిపోయి స్టార్డమ్ ఎంజాయ్ చేయలేకపోయాను. పెండ్లి తర్వాత నా కెరీర్ మందగించింది.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇదంతా కల కాదుకదా అనిపిస్తుంది. మనం పుట్టింది ఏదో ఒకటి సాధించేందుకే. చచ్చేలోపు ఆ లక్ష్యాన్ని చేరుకుని తీరాలి. ప్రస్తుతం గంగానది పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొంటున్నా. ఈ మధ్యే ముంబైలో ఓ నాట్య ప్రదర్శన ఇచ్చాను. కాలికి గజ్జె కట్టగానే నాలోని అలనాటి హేమమాలిని బయటికొచ్చింది. ‘మీరూ ఓటీటీలో కనిపిస్తారా?’ అని అడుగుతున్నారు చాలామంది. పెద్దతెర మీద జనాలు నీరాజనాలు పలికారు. చిన్న తెర మీద అంత మజా రాదేమో అనిపిస్తున్నది. అయినా అన్నీ మనమే అనుకుంటే ఎలా? జనాలు, దేవుడు.. ఏం డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది’ అంటూ తన మనసులోని మాట చెప్పారు హేమాజీ.