రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల స్వీకరణ విషయంలో సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరుపై అగ్ర నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమకు చెందిన కొందరు ఈ వేడుకకు హాజరు కాకపోవడం పట్ల ఆయన అసహనం వెలిబుచ్చారు. ప్రభుత్వాలు అవార్డులిస్తున్నాయంటే తప్పనిసరిగా అందరూ రావాలని, అవార్డుల తేదీ ప్రకటించాక, ఆ తేదీని అందరూ డైరీల్లో నోట్ చేసుకొని, ఆ రోజును అవార్డు కోసమే కేటాయించాలని, ప్రభుత్వం గుర్తించి ఇస్తున్న అవార్డులను జాగ్రత్తగా స్వీకరించాలని దిల్రాజు చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. మా ఆరు నెలల కష్టం సఫలమైనందుకు ఆనందంగా ఉంది.
వేడుకలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు. ఈ వేడుక కోసం 2:15 గంటల విలువైన సమయాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగార్ల మార్గనిర్దేశం వల్లనే ఈ వేడుక ఈ స్థాయి సక్సెస్ అయ్యింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వనుంది. ఎక్కడున్నా.. షూటింగులతో బిజీగా ఉన్నా.. ప్రభుత్వం ఇస్తున్న అవార్డులను స్వీకరించేందుకు అందరూ రావాలి. ప్రభుత్వాలతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిదీ.’ అంటూ దిల్రాజు సూచించారు. ఎఫ్డీసీ ఎండీ హరీశ్ ఐఏఎస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.