Nana Patekar | నానాపటేకర్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయన సినిమాలు ఆయన చూడరు. ఈ విషయాన్ని కొనేళ్ల క్రితం ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆయన సినిమాలు చూడ్డం కూడా తక్కువే. ఇటీవల నానా పటేకర్ చూసిన సినిమా ‘యానిమల్’. ఈ విషయాన్ని తన తాజా చిత్రం ‘వనవాస్’ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు నానాపటేకర్. ‘యానిమల్’లో కీలక పాత్ర పోషించిన అనిల్ కపూర్ ఈ ఇంటర్వ్యూకి హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. నానా పటేకర్ మాట్లాడుతూ ‘నేను సినిమాలు చూడటం అరుదు. నా స్నేహితుల బలవంతం చేయడంతో ‘యానిమల్’ చూశాను. అది కూడా కేవలం అనిల్ కపూర్ కోసం.
ఆ సినిమా చూశాక అనిల్‌కి కాల్ చేశాను. ‘అనిల్-మాల్’ చూశాను అని చెప్పాను గుర్తుందా?’ అని ఎదురుగా ఉన్న అనిల్కపూర్ని ప్రశ్నించారు నానా పటేకర్. ఇంకా మాట్లాడుతూ ‘ఆ సినిమాలో పరిధి మేరకు నటించింది అనిల్ మాత్రమే. ఆయన నటన సమయానుకూలంగా అనిపించింది. మిగతా వాళ్లంతా ఓవరాక్షన్ చేశారనిపించింది’ అంటూ వ్యాఖ్యానించారు నానా పటేకర్. ప్రస్తుతం ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దేశం గర్వించదగ్గ మహానటుడు నుంచి ఇలాంటి మాటలు రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి ఈ పరిణామంపై ‘యానిమల్’ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.