Esha Deol | ‘శారీరకంగా పురుషులు బలవంతులు కావచ్చు.. అంతమాత్రాన స్త్రీలను ఇబ్బందిపెట్టే హక్కు వారికి లేదు’ అంటూ ఘాటుగా స్పందించింది బాలీవుడ్ భామ ఈషా దేవోల్. సమాజంలో మహిళలపై వేధింపులు శృతిమించుతున్నాయని, వాటిని ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని ఈషా దేవోల్ పేర్కొన్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఈషా గుర్తుచేసుకున్నది.
‘ఓ వేడుకలో నాతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చెంప పగిలేలా కొట్టాను. అది జరిగి 20ఏండ్లు అవుతున్నది. అయినా ఆ జ్ఞాపకం అలాగే నా మనసులో ఉండిపోయింది. పూణెలో జరిగిన ‘దాస్’ మూవీ ప్రీమియర్ ఈవెంట్లో జరిగిన సంఘటన అది. ప్రధాన నటీనటులతోపాటు నేనూ ఆ కార్యక్రమానికి హాజరయ్యా. మమ్మల్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున వచ్చారు. వారిని కంట్రోల్ చేయడం బౌన్సర్ల వల్ల కూడా కాలేదు.
ఇంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సందట్లో సడేమియా అన్నట్టు నన్ను అభ్యంతరకర రీతిలో తాకాడు. నేను మెరుపు వేగంతో అతని చేయి పట్టుకొని గుంపులోంచి బయటకు లాగి, చెంప చెళ్లు మనిపించా. అది చూసిన అందరూ షాక్. నిజానికి నేను చాలా జోవియల్ పర్సన్‌ని. నాకు సహనం కూడా ఎక్కువే. అయితే దాన్ని పరీక్షిస్తూ ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురైనా ఇలాగే స్పందించాలని నేను కోరుకుంటా.’ అని తెలిపింది ఈషా దేవోల్.