‘మంచి సినిమా చేసిన తర్వాత మనసులో ఓ గర్వం ఉంటుంది. అదే ఫీలింగ్‌తో టీమ్ అందరం ఉన్నాం. ఫలితం ఎలా ఉంటుందోననే భయం మాలో కొంచెం కూడా లేదు’ అని అన్నారు నాని. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ నెల 24న విడుదలకానుంది. మంగళవారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ‘వరంగల్‌లో ఏది మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. నాని గతంలో వరంగల్‌లో ‘ఎమ్సీఏ’ సినిమా చేసి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. ఆ సమయంలో ఆయనతో చక్కటి అనుబంధం ఏర్పడింది. వరంగల్‌లో సినిమా షూటింగ్‌లు చేయడానికి వచ్చే అందరికీ నా వంతు సాయం చేస్తాను’ అని తెలిపారు. నాని మాట్లాడుతూ ‘వరంగల్ నేలపై పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అదే నన్ను మళ్లీ ఇక్కడకు రప్పించింది. మంచి సినిమా చూశామనే సంతృప్తితో ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. సాయిపల్లవి, కృతిశెట్టి పాత్రలు ఆకట్టుకుంటాయి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిపల్లవి, కృతిశెట్టి, దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.