ఏడాదిన్నర క్రితం ‘మ్యాడ్’ సినిమాతో కుర్రహీరోలు నార్నె నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్‌లు చేసిన అల్లరి అంతాఇంతా కాదు. ఈ నెల 28న ఆ ముగ్గురు ‘మ్యాడ్ స్కేర్’తో రెట్టింపు వినోదాన్ని మోసుకొస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర హారిక, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలను సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ యువహీరోలు పంచుకున్నారు. వినోదమే ఈ సినిమాకు మెయిన్ హీరో అనీ, అదే సినిమాను నడిస్తుందని, ‘మ్యాడ్’ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ‘మ్యాడ్ స్కేర్’ని అడుతూపాడుతూ చేశామని సంగీత్ శోభన్ చెప్పారు. ఇది కుటుంబ సమేతంగా చూడగలిగే క్లీన్ కామెడీ ఫిల్మ్ అని, ‘మ్యాడ్’లో కంటే ‘మ్యాడ్ స్కేర్’లో తన లడ్డు పాత్ర మరింత కామెడీగా ఉంటుందని సంతోష్‌శోభన్ తెలిపారు.
నార్నె నితిన్ మాట్లాడుతూ ‘ ‘మ్యాడ్’ ప్రారంభంలో నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. తర్వాత అందరితో సరదాగా కలిసిపోతుంది. కానీ ఈ సినిమాలో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తా. నవ్వించడమే లక్ష్యంగా తీసుకొని చేసిన సినిమా ఇది. అందుకే పెద్ద కథ ఉంటుందని ఆశించొద్దు. సరదాగా నవ్వుకోడానికి రండి. నా తొలి సినిమా నుంచీ నాకు సలహాలిస్తూ ముందుకు నడిపిస్తున్నారు మా బావ తారక్. ఆయన సూచనలకు తగ్గట్టుగా నన్నునేను మలచుకుంటున్నా.’ అన్నారు. ‘మ్యాడ్’ తమ కెరీర్‌కే స్పెషల్ మూవీ అని, పేరుకు తగ్గట్టే రెట్టింపు వినోదం ఉంటుందని, తొలి సినిమా ‘మ్యాడ్’ని భయంతో చేశానని, ఈ సినిమాను మాత్రం కాన్ఫిడెంట్‌తో చేశానని, ఈ సినిమా విషయంలో సూర్యదేవర నాగవంశీ పాత్ర కీలకమని, ఆయన వల్లే తనకు మనోజ్ పాత్ర దక్కిందని, దర్శకుడికీ, నటీనటులకు కూడా నాగవంశీ పూర్తి స్వేచ్ఛనిస్తారని రామ్ నితిన్ పేర్కొన్నారు.