L2 Empuraan | ఒకవైపు వివాదాలతో వార్తల్లో నిలుస్తునే మరోవైపు బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది మలయాళ చిత్రం ఎల్ 2 ఎంపురాన్(L2: Empuraan). మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించగా.. మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతునే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది.
గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించి ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ వివాదంపై సెన్సార్ బోర్డ్ 17 కట్స్ చెప్పడంతో పాటు మోహన్‌లాల్ కూడా క్షమాపణలు తెలిపాడు. మరోవైపు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు నిర్మాతపై ఈడీతో పాటు ఐటీ దాడులను ప్రయోగించింది కేంద్రం. అయితే ఈ సినిమాపై ఎన్ని కేసులు పెట్టిన బాక్సాఫీస్ కలెక్షన్లను మాత్రం ఆపలేకపోతుంది. తాజాగా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో ఇప్పటివరకు మలయాళంలో ఉన్న ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) రికార్డును తాజాగా ‘ఎంపురాన్’ అధిగమించింది.
మలయాళంలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన రికార్డు ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) (రూ.241 కోట్లు) పేరిటా ఉండగా.. తాజాగా రూ.250 కోట్లతో ‘ఎంపురాన్’ అధిగమించింది. ఈ రికార్డును ఎంపురాన్ కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించడం విశేషం. మరోవైపు ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ఎంపురాన్ మూడో స్థానాన్ని సంపాదించింది. ఈ జాబితాలో ఛావా (రూ.800 కోట్లు) అగ్రస్థానంలో నిలవగా, వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం (రూ.255 కోట్లు) రెండవ స్థానంలో ఉంది.