Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు ఎన్నికల ఎఫెక్ట్ తాకింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అయితే ఈ ఎన్నికల కోసం తన సిబ్బంది అంతా ఊర్లకి వెళ్లారని ఈ ఎఫెక్ట్ ‘కల్కి’ మూవీ సీజీ వర్క్స్‌పై పడిందని నిర్మాత స్వప్నదత్ ఒక పోస్ట్ పెట్టింది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఉన్న ఫొటోను స్వప్న దత్ షేర్ చేసింది. ఇందులో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణని ఫొటో మీదా రాసుకొచ్చింది. మన సినిమాకి సీజీ వర్క్ చేస్తున్న వారంతా హైదరాబాద్ నుంచి ఎలక్షన్స్ కి వెళ్లిపోయారు అని నాగ్ అశ్విన్ అనగా.. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటా అని స్వప్న అడిగింది. నాకెందుకండి, నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావాలి కానీ అంటూ సమాధానమిచ్చినట్టు పోస్ట్ చేసింది స్వప్న. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kalki
ఈ సినిమాకు మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, పశుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం (Mahabharat) కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది.