Nagadurg | తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఫోక్ సాంగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కూచిపూడి డ్యాన్సర్, తెలంగాణ జానపద నృత్య కళాకారిణి నాగదుర్గ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ప్రముఖ తమిళ నటుడు ధనుష్ మేనల్లుడు అయిన పవీష్ నారాయణ్ (Pavish Narayan) నటిస్తున్న తాజా చిత్రంలో ఆమె హీరోయిన్గా ఎంపికయినట్లు తెలుస్తుంది.
ధనుష్ మేనల్లుడు పవీష్ నారాయణ్ హీరోగా తమిళంలో ఇటీవలే కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు మగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయికగా నాగదుర్గ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాతో నాగదుర్గ తమిళ వెండితెరకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగులో ఇప్పటికే కలివి వనం అనే సినిమాలో నాగదుర్గ నటించింది. అయితే ఈ సినిమాతో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. మరోవైపు నాగదుర్గ చేసిన ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన దారి పొంటోత్తుండు (Daripontothundu) అనే పాట అయితే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్‌ను దాటి రికార్డు సృష్టించింది. ఈ పాటతోనే తమిళంలో అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఇక ఈ కొత్త సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.