Jagapatibabu | హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గా దూసుకుపోతున్న నటుడు జగపతిబాబు. లేజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జగపతిబాబు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.ఈరోజు తన 60 వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జగపతిబాబు నివాసానికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ జగపతిబాబు హీరోగా, విలన్‌గా తన గొప్పనటనతో సినీ ప్రేక్షకులతో అనుబంధాన్ని , అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రత్యేకించి ఈయనకు మహిళల్లో ఎక్కువ మంది అభిమానులుంటారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. సుధీర్ఘంగా సినిమాల్లో నటిస్తూ మరింత గొప్ప పేరు తెచ్చకోవాలి. ఆయనకు ఆనేక అవార్డులు, రివార్డులు రావాలని ఆకాంక్షిస్తున్నాను. చిరకాల మిత్రునికి మరోమారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
తాజాగా జగపతిబాబు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన సదస్సుకు జగపతిబాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానం చేయడం వల్ల రియల్ లైఫ్‌లోనూ హీరోగా మారొచ్చని తెలిపాడు. మనిషి చనిపోయిన తర్వాత 200 గ్రాముల బూడిద తప్ప ఇంకేమీ మిగలదని, కానీ అవయవదానం చేయడం వల్ల ఏడెనిమిది మందికి పునర్జన్మ కలిగించిన వాళ్లం అవుతామని చెప్పుకొచ్చాడు. అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు పద్మ భూషణ్ లు ప్రదానం చేయాలని ఆయన అన్నారు.