Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నలుగురు టాలీవుడ్ ప్రముఖ నటీనటులకు సమన్లు జారీ చేసింది. హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మిలకు సమన్లు పంపి.. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 23న రానా దగ్గుబాటి, జులై 30న ప్రకాశ్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిని విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇదే కేసులో పేరున్న మిగతా వారికి సైతం దశలవారీగా సమన్లు జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది నటీనటులతో పాటు కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సలర్లపై ఈడీ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసి సమన్లు పంపింది. అక్రమ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తున్నది. ఈ బెట్టింగ్ యాప్‌లతో మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ.. గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్‌లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్సైట్ల లింక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటీనటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత, మంచు లక్ష్మి, శ్రీముఖి, శ్యామల పేర్లున్నాయి.
యూట్యూబర్లు హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని యూట్యూబ్ ఛానెల్‌తో సహా అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు ఈ కేసులో ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్‌తో మనీలాండరింగ్‌తో పాటు హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఇదే కేసులో గూగుల్, మెటా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడం, వెబ్సైట్ల లింక్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లుగా ఆరోపణలున్నాయి.