Betting App Case | బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి మనీలాండరింగ్, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో విచారణను మరింత వేగవంతం చేస్తూ, తాజాగా పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది.బెట్టింగ్ యాప్ కేసులో సెలెబ్రెటీలు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అందజేయడం జరిగింది. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్‌రాజ్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అలానే వచ్చే నెల 6న విజయదేవరకొండ, 13న మంచులక్ష్మి విచారణకు రావాలని ఈడీ తెలిపింది.
ఈ కేసులో గూగుల్ మరియు మెటా సంస్థలపైనా ఈడీ దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్‌లకు తమ వేదికలపై విస్తృత ప్రచారం కల్పించడంపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కంపెనీలు కేవలం ప్రకటనల స్లాట్లను కేటాయించడమే కాక, సంబంధిత యాప్‌ల వెబ్సైట్లకు లింకులు కూడా అందుబాటులో ఉంచినట్లు ఆరోపించింది. ఈ సంస్థల ప్రతినిధులను జూలై 28న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విషయంలో ఈడీ జోరు పెంచింది.
కాగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీరితోపాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ల పైకూడా ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే యాంకర్లు విష్ణు ప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన విషయం తెలిసిందే.