Dussehra | సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌కి భారీగా కాసులు కురిపించే పండుగ ఏదైనా ఉందంటే అది దసరా. ఈ పండుగలో సినిమా విడుదలలు మాత్రమే కాకుండా, కొత్త ప్రాజెక్టులకు పూజలు, అనౌన్స్మెంట్లు జరగడం టాలీవుడ్లో కొత్తేమి కాదు. ఈసారి దసరా కూడా అలాంటి సినిమాల హంగామాతో కాసుల వర్షాన్ని అందించనుంది.ఈ ఏడాది దసరా సందర్భంగా పలు స్టార్ హీరోలు తమ కొత్త సినిమాల పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ.. కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే సినిమాలో నటిస్తున్నారు. అదే సమయంలో వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చేసిన “విశ్వంభర” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పుడు చిరు తన తదుపరి సినిమాగా మరోసారి బాబీ (కెఎస్ రవీంద్ర) కి ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కెవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. అక్టోబర్ 2న దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు. తదుపరి సినిమాగా ఇటీవల OG సినిమాతో హిట్ కొట్టిన సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారు.
ఈ ప్రాజెక్టును నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్నారు. ఇంతకు ముందు ఇదే బ్యానర్ పై నాని చేసిన శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు దసరా రోజున జరగనున్నాయి. షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకాబోతుంది. మరోవైపు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, దిల్ రాజు నిర్మాణంలో ఓ భారీ చిత్రం చేయబోతున్నారు. ఈ సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా దసరా పండుగ రోజున అత్యంత ఘనంగా జరగనున్నాయి. మరోవైపు కొన్ని సినిమాల క్రేజీ అప్డేట్స్ కూడా ఆ రోజు రానున్నాయి.