Kaantha Movie Review | దుల్కర్ సల్మాన్, రానా.. ఇద్దరూ సినిమా అంటే ప్రత్యేకమైన అభిరుచి వున్న నటులు. ఈ ఇద్దరూ కలసి నటిస్తూ నిర్మించిన సినిమాగా అందరి దృష్టిని ఆకర్షించింది ‘కాంత’. ఇదొక పీరియాడిక్ డ్రామా. ఈ కథకు సంబంధించి తమిళనాడులో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే సినిమా టీం మాత్రం ఇది ఎవరి బియోపిక్ కాదు.. ఫిక్షనల్ స్టొరీని చెప్పింది. మరి బియోపిక్ లా అనిపించిన ఆ ఫిక్షనల్ కథ ఏమిటి ? దుల్కర్, రానా కలసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులని అలరించిందా? రివ్యూలో చూద్దాం.
కథ
అయ్య (సముద్రఖని) పేరు ప్రఖ్యాతలున్న దర్శకుడు. తన తల్లి శాంత కథని సినిమాగా తీయాలనుకుంటాడు. తన శిష్యుడైన మహదేవన్ (దుల్కర్ సల్మాన్) అందులో హీరో. మహదేవన్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది అయ్యనే. కానీ ఇద్దరి మధ్య ఈగో క్లాష్ తో దూరం పెరుగుతుంది. కొన్ని కారణాల వలన ఆగిపోయిన ‘శాంత’ మళ్ళీ పట్టాలెక్కుతుంది. అయితే ఈసారి తను చెప్పిన క్లైమాక్స్తోనే సినిమాని తీయాలనే కండీషన్ పెడతాడు మహదేవన్. అంతేకాదు శాంతని `కాంత`గా మార్చేస్తాడు. కథానాయికగా కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ప్రాజెక్ట్ లోకి వస్తోంది. కుమారి, మహదేవన్ మధ్య ప్రేమ చిరుగిస్తుంది. ఈగో క్లాష్ తో సాగుతున్న సినిమాకి మరో సమస్య వచ్చిపడుతుంది. సినిమా యూనిట్ లో ఒకరు హత్యకు గురవుతారు. ఆ హంతకుడిని కనిపెట్టేందుకు ఇన్స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. తర్వాత ఏం జరిగింది? హత్య చేసింది ఎవరు? అయ్యా, మహాదేవ్ ఈగో కి కారణం ఏమిటి? చివరి కాంతకి ఎలాంటి క్లైమాక్స్ దొరికుందనేది తెరపై చూడాలి.
విశ్లేషణ: సినీ రంగంలో ఉద్ధండులైన దర్శక, హీరో మధ్య నెలకొన్న ఈగో క్లాష్ కాన్ఫ్లిక్ట్ తో నడిచే కథ ఇది. ఈ కాన్ఫ్లిక్ట్ కి ఒక మర్డర్ మిస్టరీ తోడు కావడం, అలాగే 1950 నేపధ్యం కావడంతో తెరపై చూస్తున్నప్పుడు ఒక కొత్త అనుభూతి కలిగించింది. సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే అలనాటి సినీ ప్రపంచంలో ప్రేక్షకుడు లీనమైపోతాడు. ప్రథమార్ధం సినిమాలో సినిమా చుట్టూ నడిచే సన్నివేశాలు నిజంగా సినిమాని ఫిల్మ్ మేకింగ్ ని ఇష్టపడే ప్రేక్షకులకు మరింతగా నచ్చుతాయి. మర్డర్ తో కథ కొత్త మలుపు తిరుగుతుంది.సెకండ్ హాఫ్ హత్య కేసు పరిశోధన చుట్టూనే సాగుతుంది. సడన్ తీసుకున్న ఈ టర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫీలింగ్ కలిగిస్తుంది. రానా పాత్ర ప్రవేశం ఆసక్తిని పెచుతుంది. కాకపొతే ఇన్వెస్టిగేషన్ కాస్త లాగ్ అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ సినిమాకి ఆయువు పట్టుగా నిలిచింది. అక్కడ పండిన డ్రామా, దుల్కర్ నటన నెక్స్ట్ లెవల్ లో వుంటుంది.
నటీనటులు: ఈ సినిమాకి బలం కథ కథనం అనడం కంటే నటీనటులు అద్భుతమైన ప్రదర్శన కారణంగా నిలబడిన సినిమా ఇది. నిజంగా దుల్కర్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన లుక్, పెర్ఫార్మెన్స్, డైలాగ్ డిక్షన్, ముఖ్యంగా క్లోజప్పుల్లో తన ఎక్స్ ప్రెషన్స్ ‘వావ్’ అనిపించేలా వుంటాయి. నటిగా భాగ్యశ్రీకి ఫుల్ మార్కులు పడిపోతాయి. అలనాటి తార పాత్రలో పరకాయప్రవేశం చేసింది. సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దుల్కర్, సముద్రఖని పోటీపడి నటించారు. రానా పాత్ర కూడా చక్కగా కుదిరింది. నిజానికి ఇందులో ఇన్వెస్టిగేషన్ కొత్తగా వుండదు. కానీ రానా ప్రజెన్స్ రొటీన్ ని కూడా ఇంటెన్స్ గా ఫీల్ అయ్యేలా చేసింది.
టెక్నికల్: సంగీతం, కెమరా వర్క్ ఈ సినిమాకి మరో పెద్ద ఎసెట్. డాని విజువల్స్ ఒక గోల్డెన్ ఏజ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించాయి. ఆర్ట్ వర్క్ చక్కగా కుదిరింది. సినిమా, సినిమా నిర్మాణం, వింటేజ్ సినిమాపై ఇష్టం వున్న ఆడియన్స్ కి కాంత మరింతగా కనెక్ట్ అవుతుంది.
ప్లస్ పాయింట్స్
దుల్కర్, రానా, భాగ్యశ్రీ, సుముద్రఖని నటన
కథా నేపధ్యం, మ్యూజిక్ విజువల్స్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో కాస్త లాగ్
రేటింగ్:3/5