Dulqer Salmaan | ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు మలయాళీ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. గత ఏడాది ‘సీతారామం’ చిత్రం తెలుగులో ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ విశేషాలతో పాటు సినిమాల ఎంపికలో తన తండ్రి, సీనియర్ నటుడు మమ్ముట్టి అభిప్రాయాలు ఎలా ఉంటాయనే విషయాలను వెల్లడించారు. సతీమణి అమల్ సూఫియాకు తన స్టార్డమ్ గురించి ఏ మాత్రం అవగాహన లేదని, ఓ సాధారణ ఇల్లాలిగానే ఆమె ప్రవర్తిస్తుందని చెప్పారు.
‘ఆమె దృష్టిలో నటన అంటే ఒక ఉద్యోగం లాంటిది. ఉదయాన్నే వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంటే చాలని అనుకుంటుంది. అంతకు మించి నా నుంచి ఏమీ ఆశించదు’ అని దుల్కర్ సల్మాన్ చెప్పారు. తండ్రి మమ్ముట్టి నటుడిగా తన విజయాల పట్ల సంతోషంగా ఉన్నారని, అయితే ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఆయన కోరిక అని తెలిపారు. ‘నేను సంవత్సరానికి ఐదారు సినిమాలు చేసిన రోజులున్నాయి. నువ్వు ఏడాదికి రెండు సినిమాలు కూడా చేయట్లేదు. ఇలా అయితే ఇంకోసారి ఇంట్లోకి రానివ్వను’ అని నాన్న తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోటా’ అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.