Lucky Baskhar | తెలుగులో మంచి ఫాలోయింగ్ తో పాటు సూపర్ హిట్ ట్రాక్ వున్న హీరో దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం .. రెండూ క్లాసిక్స్ అనిపించాయి. ఇప్పుడు తన నుంచి ‘లక్కీ భాస్కర్’ వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు ఆర్ధిక నేరం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? డబ్బు సంపాదన కోసం భాస్కర్ ఆడే ఆట ప్రేక్షకులకి నచ్చిందా? దుల్కర్ కెరీర్ లో మరో హిట్ పడిందా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ: అది1990లో ముంబై. మగధ బ్యాంక్ లో అసిస్టెంట్ మ్యానేజర్ భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్). ఓ రోజు మార్నింగ్ వాక్ చేస్తున్న భాస్కర్ ని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకొని బ్యాంక్ లో జరిగిన ఓ స్కాం గురించి విచారణ చేస్తారు. విచారణలో భాగంగా భాస్కర్ బ్యాంక్ అకౌంట్ చూసిన సిబిఐ అధికారులు ఆశ్చర్యపోతారు. తన అకౌంట్లో ఏకంగా వందకోట్లు వుంటాయి. రెండేళ్ళ క్రితం ఆరువేల జీతానికి పని చేస్తూ, కనిపించిన ప్రతిచోట అప్పు చేసి కుటుంబాన్ని భారంగా నడుపుతున్న భాస్కర్ ఉన్నఫలంగా అంత డబ్బు ఎలా సంపాదించాడు? అసలు మగధ బ్యాంక్ లో జరిగిన స్కామ్ ఏమిటి? డబ్బు సంపాదన కోసం భాస్కర్ ఎలాంటి రిస్కులు చేశాడు? ఫైనల్ ఈ ఆర్ధిక చిక్కుల నుంచి ఎలా బయటపడ్డాడనేది మిగతా కథ.
కథా విశ్లేషణ : స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా వచ్చిన వెబ్ సిరిస్ ‘స్కామ్ 1992’. ఇది మంచి ఆదరణ పొందింది కూడా. భారతీయ ఆర్థిక వ్యవస్థని కుదిపేసిన హర్షద్ మెహతా స్కాం ని ఆధారంగా చేసుకునే దర్శకుడు వెంకీ లక్కీ భాస్కర్ కథని సృష్టించాడు. ఈ క్రియేషన్ ఆడియన్స్ కి ఓ కొత్తతరహ సినిమా చూసిన అనుభూతిని కలిగించింది. భాస్కర్ మొదట హర్షద్ మెహతా గురించి పరిచయం చేస్తూ.. ‘ఇది అతని కథ కాదు. నా కథ’అని చెప్పడంతో చాలా ఆసక్తికరంగా కథనం మొదలౌతుంది. నిజానికి ఇలాంటి ఆర్ధిక నేరాలు నేపథ్యం వున్న కథల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంతగా కుదరవు. కానీ లక్కీ భాస్కర్ లో ఫ్యామిలీ ఎమోషన్ ప్రత్యేకంగా నిలిస్తుంది. భాస్కర్ చేస్తున్నది తప్పని తెలిసినా తన ఫ్యామిలీ కోసం చేస్తున్నాడనే సింపతి ఆడియన్స్ లో కలగడం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.
రెగ్యులర్ ఫైట్లు పాటలు డ్యాన్సులు వున్న సినిమా కాదిది. సీన్ లో వున్న బలం, డైలాగుల మీదే కథ నడుస్తుంది. అయినప్పటికీ కొన్ని మాస్ మూమెంట్స్ కుదిరాయి. భాస్కర్ రిస్క్ నుంచి బయటపడిన ప్రతిసారి ఆడియన్స్ లో ఒక రిలీఫ్ వుంటుంది. అంతలా ఆ పాత్రని కనెక్ట్ చేశారు. భాస్కర్ కుటుంబం ఎదురుకున్న అవమానాలు, బ్యాంక్ డబ్బుతో పోర్ట్ లో బిజినెస్ చేయడం, ప్రతిసారి రిస్క్ అంచుల్లోకి వెళ్లి రావడం.. ఇవన్నీ కూడా ప్రేక్షకుని కథలో లీనం చేసేలా వుంటాయి. లక్కీ భాస్కర్ సెకండ్ హాఫ్ అంతా హర్షద్ మెహతా బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. స్టాక్ మార్కెట్, బ్యాంక్ రిసీట్, హవాలా.. ఇలా ఆర్ధికపరమైన అంశాలపై అవగాహన వుంటే ఆ ట్రాక్ మరింతగా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమాకి దర్శకుడు ఇచ్చిన క్లైమాక్స్ మరో బలం. హీరో క్యారెక్టర్ ఎలాంటిదో డిసైడ్ చేసుకునే ఛాయిస్ ఆడియన్స్ కే వదిలేశాడు. ఫైనల్ గా భాస్కర్ ఆడిన గేమ్ ఆడియన్స్ ని అలరించేలానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని మైనస్సులు లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే గోవా ఎపిసోడ్ మరీ సినిమాటిక్ గా ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ లో భాస్కర్ లో వచ్చే మార్పు అంత సహజంగా కుదరలేదు. అలాగే సుమిత( మీనాక్షి చౌదరి) హోం ఫుడ్ బిజినెస్ నేపధ్యం, అందులోనుంచి వచ్చే కాన్ ఫ్లిక్ట్ అంత బలంగా వుండవు.
నటీనటుల నటన: భాస్కర్ క్యారెక్టర్ లో దుల్కర్ ఒదిగిపోయాడు. కథ మొత్తం తన భుజాన మోశాడు. ప్రేక్షకుడిని తన నటనతో చూపుతిప్పుకొనివ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దుల్కర్ వన్ మ్యాన్ షో ఇది. భాస్కర్ భార్య పాత్రలో మీనాక్షి పద్దతిగా కనిపించింది. ఫ్యామీలి ఎమోషన్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. రాంకీ, కసిరెడ్డి, సచిన్ కేడ్కర్, సాయి కుమార్ మిగతా పాత్రల్నీ కథకు తగ్గట్టుగా వున్నాయి.
టెక్నికల్ గా: జీవి ప్రకాష్ పాటలు రిజిస్టర్ కావు కానీ నేపధ్య సంగీతం బావుంది. థ్రిల్ ని ఎలివేట్ చేసేలా మ్యూజిక్ ఇచ్చాడు. నిమిష్ రవి కెమరాపనితనం చక్కగా కుదిరింది. అలనాటి ముంబైని చూపించేలా ఆర్ట్ వర్క్ డీసెంట్ గా చేశారు. ఎడిటింగ్ ప్యాట్రన్ బావుంది. సీన్ ఓపెన్ చేసిన మళ్ళీ వెనక్కి వెళ్లి ముందుకు రావడం ఎంగేజింగ్ గా కుదిరింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్ : దుల్కర్ సల్మాన్ డైరెక్షన్, రైటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ : ఒకటి రెండు వీక్ సీన్స్
ఫైనల్ గా: భాస్కర్ ఆట అదిరింది
రేటింగ్: 3/5