Drishyam 3 | భారతీయ సినీ పరిశ్రమలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మూడో భాగం ‘దృశ్యం 3’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు అద్భుతమైన కథనం, ఉత్కంఠభరిత ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరింత పెద్ద స్థాయిలో చూపించేందుకు దర్శకుడు జీతూ జోసెఫ్ సిద్ధమయ్యారు.శనివారం విడుదలైన ‘దృశ్యం 3’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈసారి కథ మరింత డార్క్, ఇంటెన్స్‌గా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. “గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. అది సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది” అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుండగా, జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు.
గత రెండు భాగాల్లో పోలీసుల దర్యాప్తు ప్రధానంగా సాగిన కథ.. ఈసారి కొత్త మలుపు తిరిగింది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి మీడియా ఇన్వెస్టిగేషన్‌ను కథలో కీలక అంశంగా చూపించారు. వరుణ్ ప్రభాకర్ కేసు వెనుక ఉన్న నిజాలను వెలికితీయడానికి ఇద్దరు యువ జర్నలిస్టులు రంగంలోకి దిగడం కథలో ఆసక్తిని మరింత పెంచుతోంది. జార్జ్ కుట్టి కుటుంబం చుట్టూ మళ్లీ అనుమానాలు ముసురుకుంటుండగా, మీడియా విచారణతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారినట్లు ట్రైలర్లో చూపించారు. కుటుంబాన్ని రక్షించుకోవడానికి జార్జ్ కుట్టి ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతాడనే విషయం మరోసారి స్పష్టమవుతోంది. ప్రతి సీన్లోనూ ఉత్కంఠను పెంచేలా ట్రైలర్ కట్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో మీనా, ఎస్తర్ అనీల్, అన్సిబ హసన్, ఆశా శరత్, సిద్ధార్థ్ తదితరులు తమ పాత పాత్రలతో తిరిగి కనిపించనున్నారు. అలాగే వీణా నందకుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండో భాగంలో ఆకట్టుకున్న మురళీ గోపి, గణేష్ కుమార్, శాంతి మాయాదేవి కూడా ఈసారి కథలో భాగమయ్యారు.టెక్నికల్‌గా కూడా ‘దృశ్యం 3’ మరింత బలంగా కనిపిస్తోంది. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ, వినాయక్ వి.ఎస్ ఎడిటింగ్, అనిల్ జాన్సన్ సంగీతం ట్రైలర్‌కే థ్రిల్లింగ్ ఫీల్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాను మే 21న, మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక హిందీ ప్రేక్షకుల కోసం కూడా ‘దృశ్యం 3’ సిద్ధమవుతోంది. అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న హిందీ వెర్షన్‌ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ‘దృశ్యం 3’ మరోసారి ఇండియన్ సినీ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.