Drishyam 3 Box Office | ఇండియన్ సినిమాలో ఫ్రాంఛైజీ చిత్రాలు సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒక సినిమా బ్లాక్‌బస్టర్ అయినా.. దాని సీక్వెల్ అదే స్థాయిలో మెప్పించడం చాలా అరుదు. ముఖ్యంగా మూడో భాగం వచ్చేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోవడం, కథలో కొత్తదనం లేకపోవడం సాధారణమే. దీంతో చాలా ఫ్రాంఛైజీలు రెండో లేదా మూడో సినిమాతోనే ఆగిపోతుంటాయి. కానీ మాలీవుడ్‌లో తెరకెక్కిన ‘దృశ్యం’ ఫ్రాంఛైజీ మాత్రం ఆ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది. మొదటి భాగం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకోగా.. ‘దృశ్యం-2’ కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఫ్రాంఛైజీ స్థాయిని మరింత పెంచింది. ఇదే ఊపులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దృశ్యం-3’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఇటీవల విడుదలైన ‘దృశ్యం-3’ మాత్రం కంటెంట్ విషయంలో ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయింది. సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు.. ఇది ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ స్థాయికి ఏమాత్రం చేరలేదని అభిప్రాయపడుతున్నారు. ముందటి భాగాల్లో కనిపించిన ఉత్కంఠ, స్ట్రాంగ్ స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ కనెక్ట్ ఈసారి అంతగా వర్కౌట్ కాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు కూడా ఈ మూడో భాగం ఫ్రాంఛైజీలో వీకెస్ట్ ఫిల్మ్ అని అభిప్రాయపడుతున్నారు. కంటెంట్‌పై మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘దృశ్యం-3’ దూసుకుపోతోంది. ఫ్రాంఛైజీకి ఉన్న భారీ క్రేజ్, మోహన్‌లాల్ స్టార్ పవర్ కారణంగా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది.
వీకెండ్ తర్వాత కూడా సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కేరళలో వీక్ డేస్‌లో సైతం హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం విశేషం. మలయాళ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తుండగా.. విదేశాల్లో కూడా ఈ చిత్రం బలమైన వసూళ్లు రాబడుతోంది. డబ్బింగ్ వెర్షన్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఒరిజినల్ మలయాళ వెర్షన్ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ‘దృశ్యం-3’ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ సినీ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన సినిమాలు చాలా తక్కువే. ప్రస్తుతం సినిమా జోరు చూస్తుంటే ఫుల్ రన్లో రూ.300 కోట్ల మార్క్‌ను కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ‘లోక’ పేరిట ఉన్న ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డును కూడా ‘దృశ్యం-3’ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమాకు విమర్శలు వచ్చినా.. వసూళ్ల పరంగా మాత్రం భారీ విజయాన్ని అందుకోవడం మేకర్స్‌కు పెద్ద ప్లస్‌గా మారింది. దీంతో ఇప్పుడు ‘దృశ్యం-4’పై చర్చ మొదలైంది. మోహన్‌లాల్, దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఈ ఫ్రాంఛైజీని అక్కడితో ఆపేస్తారా? లేక మరో భాగంతో ముందుకు తీసుకెళ్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ప్రస్తుతం ‘దృశ్యం-3’ సాధిస్తున్న భారీ వసూళ్లు చూస్తుంటే.. ‘దృశ్యం-4’ తెరకెక్కే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.