e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News దృశ్యం-2 రివ్యూ

దృశ్యం-2 రివ్యూ

కొన్ని కథలకు భాషాభేదాలతో సంబంధం ఉండదు. ఏ లాంగ్వేజ్‌లో రీమేక్‌ చేసిన ఆడుతుంటాయి. దృశ్యం సినిమాను అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2014లో వచ్చిన దృశ్యం-1 చిత్రంతో అగ్రకథానాయకుడు వెంకటేష్‌ చక్కటి విజయాన్ని అందుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘దృశ్యం-2’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారాయన. మలయాళ మాతృకకు దర్శకత్వం వహించిన జీతూజోసేఫ్‌ ఈ సీక్వెల్‌ నిర్దేశక బాధ్యతల్ని స్వీకరించారు. సురేష్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మించారు. ప్రస్తుతం థియేటర్స్‌ పరంగా నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ద్వారా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నిర్మాతలు. తొలిభాగం మాదిరిగానే ఈ సీక్వెల్‌ ప్రేక్షకుల్ని మెప్పించిందా? డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో వెంకటేష్‌ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారు? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

రాజవరం గ్రామానికి చెందిన రాంబాబుకు (వెంకటేష్‌) సినిమాలంటే ప్రాణం. కష్టపడిపనిచేస్తూ కేబుల్‌ టీవీ ఓనర్‌ నుంచి సొంతంగా థియేటర్‌ నిర్వహించే స్థాయికి ఎదుగుతాడు. తన ఆలోచనలకు అనుగుణంగా ఓ సినిమాను నిర్మించే ప్రయత్నాల్లో ఉంటాడు. భార్య జ్యోతి (మీనా), పిల్లలు అంజు (కృతిక), అనులతో (ఏస్తర్‌) ఆనందంగా జీవిస్తుంటాడు. ఐజీ గీతా ప్రభాకర్‌(నదియా) తనయుడు వరుణ్‌ అదృశ్యమైన కేసు నుంచి రాంబాబు కుటుంబం నిర్ధోషిగా బయటపడి ఆరేళ్లు దాటినా పోలీసులు మాత్రం వారిని అనుమానిస్తూనే ఉంటారు. రాంబాబు కుటుంబాన్ని నీడలా వెంటాడుతుంటారు. వరుణ్‌ను చంపింది రాంబాబుతో పాటు అతడి కుటుంబసభ్యులేననే నమ్మకంతో సరైన ఆధారాల కోసం పరిశోధిస్తుంటారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీస్‌ ఆఫీసర్‌ గౌతమ్‌ సాహు (సంపత్‌రాజ్‌) రాంబాబుకు వ్యతిరేకంగా కీలకమైన ఆధారాన్ని సంపాదిస్తాడు. అదేమిటి? ఈ కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రాంబాబు ఎలాంటి సాహసం చేశాడు? తన తెలివితేటలతో పోలీసులను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

- Advertisement -

దృశ్యం-1 తరహాలోనే మర్డర్‌ మిస్టరీ అంశాలకు కుటుంబ బంధాలను జోడిస్తూ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించారు దర్శకుడు జీతూజోసెఫ్‌. తొలిభాగం ముగిసిన చోటు నుంచే సీక్వెల్‌ కథ మొదలవుతుంది. వరుణ్‌ హత్య కేసు తాలూకు భయాల కారణంగా రాంబాబు కుటుంబం పడే మానసిక ఆవేదనను, ఈ నేరానికి సంబంధించి సరైన ఆధారాలు సేకరించడం కోసం పోలీసులు సాగించే అన్వేషణ చూపిస్తూ కథ, కథనాల్ని నడిపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ నేపథ్యంలో ప్రథమార్థంలో వచ్చే సన్నివేశాలన్నీ నిదానంగా సాగుతాయి. సినిమా నిర్మాణ కోసం రాంబాబు చేసే ప్రయత్నాలు, స్నేహితులతో సాగించే కథా చర్చల తాలూకు చిక్కుముడులన్నీ ద్వితీయార్థంలోనే వీడుతాయి. వరుణ్‌ డెబ్‌బాడీని రాంబాబు దాచిన చోటు పోలీసులు కనుక్కునే సన్నివేశం నుంచి కథ పరుగులు పెడుతుంది. ప్రతీ సీన్‌లో ఏం జరుగబోతుందోననే ఉత్కంఠను పంచుతుంది. తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్న రాంబాబు కోర్టులో మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటం, తాను నిర్దోషిగా బయటపడానికి వేసిన ఎత్తులు థ్రిల్‌ను పంచుతాయి.

సాధారణంగా ఓ విజయవంతమైన చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడం చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఎన్నో అంచనాలు, సవాళ్లను దాటుకుంటూ సీక్వెల్‌ సినిమాతో ప్రేక్షకుడిని మెప్పించడానికి దర్శకుడు ఎన్నో కసరత్తులు చేయాలి. రాంబాబు కుటుంబమే వరుణ్‌ను హత్య చేసినట్లుగా మొదటి భాగంలోనే చూపించారు. తెలిసిన కథతో సీక్వెల్‌ను అనేక మలుపులతో ఉత్కంఠగా మలచడంలో దర్శకుడు జీతూజోసెఫ్‌ విజయవంతమైయ్యారు. విరామ సన్నివేశాలతో పాటు పతాక ఘట్టాల్లో ఆయన రాసుకున్న మలుపులు బాగున్నాయి.

రాంబాబు పాత్రలో వెంకటేష్‌ మరోసారి ఒదిగిపోయారు. తప్పొప్పులతో సంబంధం లేకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అతడు పడే తపనను దర్శకుడు అర్థవంతంగా తీర్చిదిద్దారు. రాంబాబు పాత్ర తప్ప వెంకటేష్‌ ఇమేజ్‌ ఎక్కడ కనిపించదు. తన భర్త, పిల్లల క్షేమం కోసం అనుక్షణం మదనపడే ఇల్లాలిగా మీనా సహజ నటనను కనబరిచింది. వెంకటేష్‌ కుమార్తెలుగా కృతిక, ఏస్తర్‌ చక్కగా నటించారు. రాంబాబును దోషిగా నిరూపించాలనే పట్టుదల కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా సంపత్‌రాజ్‌, అతడికి సహకరించే మఫ్టీ కానిస్టేబుల్‌గా సత్యం రాజేష్‌, సుజా వరుణీ కనిపించారు. నదియా, పూర్ణ, నరేష్‌ పాత్రల నిడివి తక్కువే అయినా తమ నటనతో ఆకట్టుకున్నారు.

మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల్ని వేగంగా నడిపించడం చాలా ముఖ్యం. ఆ స్పీడు ఈ సినిమాలో కనిపించదు. ఫ్యామిలీ ఎపిసోడ్స్‌ అన్ని రిపీట్‌ అవుతూనే ఉంటాయి. పోలీసుల పరిశోధన సీరియల్‌ను తలపిస్తుంది. పతాక ఘట్టాల్లో వచ్చే మలుపు లాజిక్‌లకు దూరంగా సాగుతుంది. మాతృకను యథాతథంగా ఫాలో అయ్యారు దర్శకుడు. ఒకటి, రెండు మినహా పెద్దగా మార్పులు చేయలేదు. సినిమాలో చూపించిన పల్లె వాతావరణంలో తెలుగు నేటివిటీ లోపించింది. మలయాళ ఛాయలే ఎక్కువగా కనిపించాయి. మలయాళ దృశ్యం-2 సినిమా చూసిన వారికి ఈ సినిమా కొత్తగా అనిపించదు. చూడని వారిని మాత్రం మెప్పిస్తుంది. సతీష్‌ కురుప్‌ ఛాయాగ్రహణం, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం థ్రిల్లర్‌ కథను తెరపై మరింత ఆసక్తికరంగా చెప్పడానికి దోహదపడ్డాయి. ఓటీటీ సినిమా అయినా నిర్మాతలు మాత్రం బడ్జెట్‌ విషయంలో రాజీపడలేదు.

అశ్లీలత, అసభ్యతకు తావులేని క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. కుటుంబమంతా కలిసి సరదాగా చూసేలా ఉంటుంది. థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడే వారితో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

రేటింగ్‌: 2.5/5

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement