Drinker Sai On Zee5| ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. “బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, యూత్ మరియు మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగానూ తన విజయయాత్రను ఘనంగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం జీ5 (ZEE5) ఓటీటీలోని ‘ఫ్రీ ఆన్ జీ5’ విభాగంలో ‘డ్రింకర్ సాయి’ నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఈ సినిమాలో కథానాయకుడిగా నటించిన ధర్మ మహేష్ కనబరిచిన అద్భుత నటనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒక సాధారణ యువకుడి జీవితంలోని ఆవేశం, ప్రేమ, బాధ, భావోద్వేగ సంఘర్షణలు మరియు ఆత్మగౌరవాన్ని ఆయన ఎంతో సహజంగా పండించారు. కొన్ని కీలక సన్నివేశాలలో ఆయన పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సినిమాను పూర్తిగా తన భుజాలపై మోస్తూ, పాత్రలో లీనమై ఆయన చేసిన నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో కనబరిచిన ప్రతిభకు గానూ ధర్మ మహేష్ దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గామా (GAMA) అవార్డుల్లో ‘బెస్ట్ డెబ్యూ యాక్టర్’ అవార్డును అందుకోవడం విశేషం.
హీరోయిన్గా నటించిన ఐశ్వర్య శర్మ తన అందం, అభినయంతో ఆకట్టుకోగా, హీరోతో ఆమె కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరితో పాటు రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ కథను మరింత బలోపేతం చేశారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలను కనబరిచింది. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి నేటి యువత ఆలోచనలకు తగ్గట్టుగా, ప్రేమ మరియు వినోదాన్ని సమపాళ్లలో మిక్స్ చేసి కథను అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రీవసంత్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం (BGM) ప్రధాన బలంగా నిలిచాయి. కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు నేరుగా కనెక్ట్ చేయడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకుని రోజురోజుకూ ఆదరణ పెంచుకుంటున్న ‘డ్రింకర్ సాయి’ చిత్రం ధర్మ మహేష్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇంకా చూడని వారు తప్పకుండా వీక్షించాలని చిత్ర బృందం కోరుతోంది.