Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ మాస్ లుక్, డార్క్ టోన్, విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమా తొలి భాగం విడుదలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉండగానే, ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. అదే డ్రాగన్ పార్ట్-2 గురించి. చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా, సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
సమాచారం ప్రకారం, కథ చాలా పెద్ద స్థాయిలో ఉండటంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, పార్ట్-1తో పాటు పార్ట్-2కు సంబంధించిన షూటింగ్‌ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే ప్రశాంత్ నీల్ తన గత చిత్రాల్లో భారీ స్కేల్ కథలను తెరపై అద్భుతంగా చూపించారు. దీంతో డ్రాగన్ విషయంలో కూడా ఆయన మరింత పెద్ద యూనివర్స్‌ను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. గతంలో సలార్ విషయంలో అనుసరించిన వ్యూహం మాదిరిగా రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేసి, తక్కువ గ్యాప్‌లో విడుదల చేసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, డ్రాగన్ పార్ట్-1ను జూన్ 11, 2027న విడుదల చేయాలని భావిస్తున్నారట. అదే విధంగా పార్ట్-2ను ఆరు నెలల వ్యవధిలోనే, అంటే డిసెంబర్ 2027లో విడుదల చేసేలా ప్రణాళికలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.మరోవైపు సినిమాలోని కథాంశం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ 1967 బ్యాక్‌డ్రాప్ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ వరకు కథ సాగుతుందని, ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథ పరిధి కారణంగానే ఒకే భాగంలో చూపించడం కష్టంగా మారిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మేకోవర్ అయినట్లు సమాచారం. పార్ట్-1 కోసం లీన్ లుక్‌లో కనిపించిన ఆయన, పార్ట్-2 కోసం మళ్లీ ఫిజిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి బల్క్ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది.