Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచే హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉండగా, ఇప్పుడు సినిమా రిలీజ్‌పై వస్తున్న వార్తలు అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి.దాదాపు మూడు సంవత్సరాల క్రితమే ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మేకర్స్, షూటింగ్‌ను కూడా ఏడాదిన్నర క్రితమే ప్రారంభించారు. అయితే ఇప్పటికీ చిత్రీకరణలో మెజారిటీ పార్ట్ పెండింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్న రిలీజ్ ప్లాన్స్ పూర్తిగా మారిపోతున్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్రారంభంలో ఈ సినిమాను 2026 జూన్‌లో విడుదల చేయాలని భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ డేట్లో సినిమా విడుదల కావడం అసాధ్యమేనని తెలుస్తోంది. షూటింగ్ పనులు ఇంకా చాలావరకు మిగిలి ఉండటంతో పాటు, ప్రశాంత్ నీల్ సినిమాలకు అవసరమయ్యే భారీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశముంది. తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం, ‘డ్రాగన్’ విడుదలకు ఇంకా కనీసం మరో ఏడాదిన్నర సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అంటే ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదలైనా ఆశ్చర్యం లేదని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వార్త నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు ఇది పెద్ద నిరాశగా మారే అవకాశం ఉంది.
ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా మేకర్స్ ఎలాంటి తొందరపడకుండా అత్యుత్తమ అవుట్‌పుట్ కోసం సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన కేజీఎఫ్, సలార్ లాగే ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో రూపొందిస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ జోడీపై మంచి ఆసక్తి నెలకొంది. భారీ యాక్షన్ ఎలిమెంట్స్, పాన్ ఇండియా స్థాయి కథనం, ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ట్రీట్ అన్నీ కలగలిపి ఈ సినిమాను ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలబెట్టాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక రిలీజ్ డేట్ ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.