‘దేవర’ విడుదలై అప్పుడే తొమ్మిది నెలలు కావొస్తున్నది. కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 14న బాలీవుడ్ ‘వార్ 2’తో తారక్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇక సోలో హీరోగా ఆయన నటిస్తున్న చిత్రం ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్). ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కూడా ఓవైపు గప్‌చుప్‌గా జరిగిపోతున్నది. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం ఈ నెల 3వ వారం నుంచి కొత్త షెడ్యూల్‌ని మొదలుపెట్టనున్నారట.
దీనికోసం బెంగళూర్‌లో ఓ భారీ సెట్‌ని కూడా నిర్మించారట. ఈ సెట్లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఈ సీక్వెన్స్‌లో ప్రకాశ్‌రాజ్ కూడా పాల్గొంటారని సమాచారం. సినిమా మొత్తానికి ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తున్నది. ఎన్టీఆర్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘డ్రాగన్’ను నిలిపేందుకు ప్రశాంత్‌నీల్ ఎంతో శ్రమిస్తున్నారని, స్క్రిప్ట్ కోసం ఆయన ఎక్కువ సమయం తీసుకోవడానికి కారణం కూడా అదేని ‘డ్రాగన్’ టీమ్ చెబుతున్నది. మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.