‘ఇస్మార్ట్ శంకర్’గా బాక్సాఫీస్ వద్ద రామ్, పూరీజగన్నాథ్ చేసిన సందడి అంతాఇంతాకాదు. యువతరాన్ని విశేషంగా అలరించిందా సినిమా. ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’కి పూరీజగన్నాథ్ శ్రీకారం చుట్టగానే, సినిమాపై అంచనాలు ఆటోమేటిగ్గా ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా తాజా ఆప్డేట్స్ కోసం యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శకుడు పూరీజగన్నాథ్. ఆగస్ట్ 15న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా థియేటర్లలో ‘డబుల్ ఇస్మార్ట్’ను విడుదల చేయనున్నట్టు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆగస్ట్ 15 గురువారం రావడంచేత లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసొస్తుందని, అంతేకాక, సోమవారం ‘రక్షాబంధన్’ మరో హాలిడే కూడా ఈ సినిమాకు కలిసి రావడంతో ఆగస్ట్ 15వ తేదీ రిలీజ్‌కు పర్ఫెక్ట్ అని భావించామని పూరీ తెలిపారు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రీక్వెల్ కంటే, డబుల్ మ్యాడ్నెస్ ఈ ‘డబుల్ ఇస్మార్ట్’లో ఉంటుందని పూరీ అన్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో రామ్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కెమెరా: సామ్ కె.నాయుడు, జియాని జియానెలి, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: పూరీ కనెక్ట్స్.